Gas Cylinder Price Hike :వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.209 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశాయి. విమాన ఇంధన ధరలు కూడా 5 శాతం పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరల మార్పుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,684గా ఉంది. కొత్తగా పెరిగిన ధరల ప్రకారం.. దాని ధర రూ.1,731.50కు చేరింది. సెప్టెంబర్ 1వ తేదీన 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.158 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు నెలలోనూ కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను కిలో లీటర్‌కు రూ.5,779.84 పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. దీంతో దేశ రాజధాని దిల్లీలో దీని ధర రూ.118,199.17 నుంచి రూ.112,419.33కు పెరిగింది. కాగా జులై నుంచి విమాన ఇంధన ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగోసారి.
యథాతథంగా వంట గ్యాస్ ధరలు..
Domestic Gas Cylinder Price Today :వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల గ్యాస్ ధర రూ.903గా ఉంది.