తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో భారీగా తగ్గిన పెట్రో వాడకం.. ధరల మంటే కారణమా?

Fuel sales: దేశంలో చమురు వాడకం ఏప్రిల్​లో రికార్డు స్థాయిలో తగ్గింది. గత నెలతో పోల్చితే 10 శాతం క్షీణించింది. పెట్రోల్​, డీజిల్ ధరలు భారీగా పెరగడమూ ఇందుకు ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Fuel sales fall in April on high prices
దేశంలో భారీగా తగ్గిన పెట్రో వాడకం.. ధరల మంటే కారణమా?

By

Published : Apr 16, 2022, 9:07 PM IST

Petrol sales: దేశంలో ఏప్రిల్‌ నెల తొలి అర్ధభాగంలో చమురు వాడకం (Fuel sales) తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్‌ విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్‌ వినియోగం 15.6 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అటు వంటకు ఉపయోగించే ఎల్పీజీ వినియోగం సైతం గత నెలతో పోలిస్తే 1.7 శాతం మేర తగ్గగా.. జెట్‌ ఫ్యూయల్‌ వినియోగం సైతం 20.5 శాతం మేర తగ్గడం గమనార్హం. ఎప్పుడూ లేని స్థాయిలో ధరలు పెరగడమే ఇందుకు కారణం అనుకోవాలా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలో 137 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్‌ ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మార్చి 22న ఒక్కసారిగా వాటి ధరలను పెంచేశాయి. దీంతో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 మధ్య ఎన్నడూ లేని స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.10 మేర పెరిగింది. వంట గ్యాస్‌ ధర సైతం రూ.50 చొప్పున పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ పెట్రో ధరలు పెరుగతాయన్న అంచనాలు ముందు నుంచీ ఉన్నాయి. ఎన్నికల కారణంగానే వీటి ధరలను పెంచలేదన్న నిజం జనానికీ అర్థమైంది. దీంతో మార్చి మొదటి వారంలో అటు డీలర్లు, ఇటు సామాన్య ప్రజలు సైతం తమ ట్యాంకులను నింపేసుకున్నారు. దీంతో మార్చిలో పెట్రో వినియోగం మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. తద్వారా మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌ నెల తొలి అర్ధభాగంలో వినియోగం తగ్గినట్లుగా అనిపిస్తోంది.

  • ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య 1.12 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే తేదీలతో పోలిస్తే 12.1 శాతం అధికంగా కాగా.. 2019 మార్చితో (కొవిడ్‌కు ముందుతేడాది) పోలిస్తే 19.6 శాతం ఎక్కువ. అదే మార్చి నెల తొలి అర్ధభాగంతో చూసినప్పుడు 9.7శాతం తగ్గడం గమనార్హం.
  • ఇదే సమయంలో 3 మిలియన్‌ టన్నుల మేర డీజిల్‌ విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చినప్పుడు ఇది 7.4 శాతం అధికం కాగా.. 2019 మార్చితో పోలిస్తే 15.6 శాతం ఎక్కువ. మార్చితో పోల్చినప్పుడు మాత్రం 15.6 శాతం తగ్గడం గమనార్హం.
  • ఇదే తరహాలో ఎల్పీజీ, జెట్‌ ఫ్యూయల్‌ వినియోగం తగ్గడం గమనార్హం. అంటే, చమురు ధరలు పెరగడం వల్ల వినియోగం తగ్గలేదన్న విషయం దీనిబట్టి అర్థమవుతోంది. కేవలం ధరలు పెరుగుతాయన్న ముందస్తు అంచనాలతో మార్చిలో పెద్ద ఎత్తున కొనుగోలు జరపడం వల్లే ఏప్రిల్‌లో వినియోగం తగ్గినట్లు కనిపిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే మార్చి నెలలో పెద్దగీత కంటే ఏప్రిల్‌ నెలలో గీసిన పెద్ద గీత కాస్త చిన్నగా ఉందే తప్ప.. వాస్తవంలో అయితే ఈ గీత కూడా పెద్దదే అన్నమాట!

ఇదీ చదవండి:'పన్ను' ఎక్కువవుతోందా? పెట్టుబడులకు ఇదే సరైన తరుణమా?

ABOUT THE AUTHOR

...view details