తెలంగాణ

telangana

ETV Bharat / business

'చమురు సంస్థలకు రూ.వేల కోట్ల నష్టాలు- ధరలు పెంచకపోవడం వల్లే' - చమురు కంపెనీలు ఐసీఐసీఐ రిపోర్ట్

Oil company losses: భారత దిగ్గజ చమురు సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముడి చమురు ధరలు పెరిగినా.. దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడం వల్లే సంస్థలు నష్టాలు చవిచూడాల్సి రావొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

ioc loss india news
oil company losses india

By

Published : Jul 12, 2022, 7:43 AM IST

ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)లు సంయుక్తంగా రూ.10,700 కోట్ల మార్కెటింగ్‌ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. 'ఏప్రిల్‌- జూన్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దానికి తగ్గట్లుగా పెట్రోలు, డీజిల్‌ ధరలను సవరించకపోవడంతో, చమురు మార్కెటింగ్‌ సంస్థలు నష్టాలు చవిచూడాల్సి రావచ్చు. ముడి చమురు శుద్ధి చేసి పెట్రోలు, డీజిల్‌గా మార్చే రిఫైనరీలను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి. చమురు శుద్ధి మార్జిన్‌లు అధికంగానే నమోదైనా, ఆ ప్రయోజనమూ కనిపించకపోవచ్చ'ని ఆ నివేదిక పేర్కొంది. ప్రతి లీటరు పెట్రోల్‌-డీజిల్‌పై రూ.12-14 మేర ఈ కంపెనీలు నష్టపోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ విక్రయాల్లో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వాటానే 90 శాతం వరకు ఉంటుంది.

'ఒక బ్యారెల్‌ ముడిచమురుపై స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ 17-18 డాలర్లుగా (నిల్వలపై బ్యారెల్‌కు 0.1- 0.2 డాలర్ల నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని) ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. అమ్మకాల్లో 17-20 శాతం వృద్ధి ఉండొచ్చు. అయితే పెట్రోలు, డీజిల్‌ విక్రయాల ద్వారా, అధిక నష్టాల వల్ల మొదటి త్రైమాసికంలో ఎబిటా నష్టం రూ.6,600 కోట్లుగాను, నికర నష్టం రూ.10,700 కోట్లుగా నమోదుకావచ్చ'ని నివేదిక పేర్కొంది. 2-3 రోజులుగా ముడి చమురు ధర దిగిరావడం వల్ల మున్ముందు విక్రయాలపై నష్టాల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ కూడా తగ్గుతుండటంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి, ఈ సంస్థలకు ఆదాయం పరిమితం కావొచ్చని పేర్కొంది.

రిలయన్స్‌కు కలిసి వస్తోంది: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కార్యకలాపాల పరంగా, ఆర్థిక పనితీరు పరంగా ఏప్రిల్‌- జూన్‌ బలమైన త్రైమాసికంగా ఉంటుందని వివరించింది. ఏకీకృత ఎబిటా, పన్ను అనంతర లాభం వరుసగా 67 శాతం, 77 శాతం వృద్ధితో రూ.38,900, రూ.24,400 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆ సంస్థ చరిత్రలోనే ఇది అత్యధికమని పేర్కొంది. అయితే 2022 జులై 1 నుంచి ఇంధన ఎగుమతులపై సుంకం అమల్లోకి రావడంతో, రాబోయే తొమ్మిది నెలల్లో కంపెనీ ఆదాయాలపై ప్రభావం పడొచ్చని వివరించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details