Foxconn Vedanta deal : దేశీయ వ్యాపార దిగ్గజం వేదాంతాతో కలిసి ఏర్పాటు చేయాలనుకున్న సెమీ కండక్టర్ ప్లాంట్ జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రకటించింది. ఆ ప్లాంట్‌తో తమకు ఎలాంటి సంబంధమూ ఉండబోదని, ఇక నుంచి సెమీ కండక్టర్ ప్లాంట్ పూర్తిగా వేదాంతాదేనని స్పష్టం చేసింది. గుజరాత్లో ఒకటిన్నర లక్షల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్, డిస్ప్లే తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఫాక్స్‌కాన్, వేదాంతా గతేడాది ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇతర పెట్టుబడి అవకాశాలు ఉండడంతో జాయింట్ వెంచర్ విషయంలో.. వేదాంతాతో కలిసి ముందుకెళ్లకూడదని నిర్ణయించినట్లు ఫాక్స్ కాన్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియాకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపింది. ఫాక్స్‌కాన్ వైదొలగడంపై స్పందించిన వేదాంతా సంస్థ సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. భారత తొలి సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఇతర భాగస్వాములతో కలిసి ముందుకెళ్లనున్నట్లు పేర్కొంది.
Foxconn Vedanta deal cancelled : అయితే, ఫాక్స్‌కాన్ నిర్ణయంతో భారత సెమీ కండక్టర్ లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రెండు ప్రైవేటు కంపెనీల మధ్య జరిగే పరిణామాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు. ఫాక్స్‌కాన్, వేదాంతాలు భారత్‌లో వేర్వేరుగా తమ లక్ష్యాల సాధనకు కృషి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు సంస్థలు కూడా విలువైన పెట్టుబడిదారులని గుర్తు చేశారు. భారత్‌లో ఈ రెండు కంపెనీలకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని తెలిపారు.