చైనాలో కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఐఫోన్ తయారీలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఫాక్స్‌కాన్ భారత్‌లో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే లేటెస్ట్ ఐఫోన్-14 మోడళ్ల తయారీని చెన్నైలోని ప్లాంటులో పెంచింది. చైనాలో తరచూ ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తి ఐఫోన్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకునే యోచనలో ఫాక్స్‌కాన్ ఉంది. అందుకు భారత్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.
కార్యకలాపాల్ని విస్తృతం చేయడంలో భాగంగా ఫాక్స్‌కాన్ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఇద్దరు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్యను నాలుగింతలకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో చెన్నైలోని ప్లాంటులో కొత్తగా మరో 53,000 మంది ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. ఫలితంగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 70,000కు చేరుతుందని సమాచారం. చైనాలోని జెంగ్‌ఝౌలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో దాదాపు 2 లక్షల మంది పనిచేస్తున్నారు. దానితో పోలిస్తే చెన్నైలోని ప్లాంటు చాలా చిన్నది.