Duvvuri Subbarao About GDP Growth : ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 13.5 శాతానికి పరిమితం కావడంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఈ త్రైమాసికంతో పోలిస్తే వృద్ధి భారీ ఎత్తున ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. గణాంకాలు అది సూచించడం లేదన్నారు. 2021-22 ఏప్రిల్-జూన్‌లో ఆర్థిక వ్యవస్థను కరోనా డెల్టా రకం దెబ్బతీసిన విషయం తెలిసిందే.
స్వల్పకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక కమొడిటీ ధరలు, ఆర్థికమాంద్య భయాలు, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, దేశవ్యాప్తంగా ఒకేరకంగా వర్షాలు కురవకపోవడం వంటి అంశాలు సవాళ్లుగా నిలవనున్నాయని సుబ్బారావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే ఏటా 8-9 శాతం స్థిరమైన వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాలు రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. కానీ ప్రస్తుతం వృద్ధికి ఊతమిచ్చే అనేక అంశాలు నెమ్మదించాయని తెలిపారు.
గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పట్టిన ప్రైవేటు పెట్టుబడులు ఇంకా గాడినపడాల్సి ఉందని సుబ్బారావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మందగమన భయాల వల్ల ఎగుమతులు ఇంకా అడ్డంకులు ఎదుర్కొంటున్నాయన్నారు. సేవారంగం గణనీయంగా పుంజుకోవడం ఫలితంగా ప్రైవేటు వ్యయాలు పెరగడమే తొలి త్రైమాసికంలో వృద్ధికి ఊతమిచ్చాయన్నారు. అల్పాదాయ వర్గాలకు వృద్ధి ఫలాలు ఏ మేర చేరుతున్నాయనే అంశంపైనే ఆర్థిక వ్యవస్థ బలం ఆధారపడి ఉంటుందని వివరించారు.