Cyrus Mistry Killed: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ(54) కన్నుమూశారు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా స్పాట్లోనే చనిపోయినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్యా నది వంతెన దగ్గర ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో సహా కారులో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాయాలైన ఇద్దరిని.. గుజరాత్‌లోని ఆస్పత్రికి తరలించారు. మిస్త్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖాసా రూరల్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వివరించారు.
మిస్త్రీ మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. మిస్త్రీ అకాల మరణం షాకింగ్‌కు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ వ్యాపార పరిశ్రమకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. మిస్త్రీ మరణవార్త విని కలత చెందినట్లు ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మిస్త్రీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే సహా పలువురు ప్రముఖులు మిస్త్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మిస్త్రీ మరణం తీవ్రంగా బాధిస్తుందని ట్వీట్ చేశారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్. డీజీపీతో మాట్లాడి.. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
1968 జులైలో జన్మించిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ.. యూకేలోని ఇంపీరియల్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎమ్ఎస్‌సీని చేశారు. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన, ఆయన నవంబర్ 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు.
టాటాల వారసుడిగా ఎంపికై న్యాయపోరాటం చేసి..
2012లో రతన్ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్‌కు సైరస్ మిస్త్రీ ఛైర్మన్ అయ్యారు. అప్పటికి 43 ఏళ్ల సైరస్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు 18 శాతం వాటా ఉంది. అయితే, ఆ పదవి చేపట్టిన నాలుగేళ్లకే మిస్త్రీకి టాటా గ్రూప్ ఉద్వాసన పలికింది. ఆయనకు నిర్దేశించిన వివిధ లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. అదే సమయంలో గ్రూపు ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న వాదనలూ ఉన్నాయి.
టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న మిస్త్రీ.. తన తొలగింపు విషయంలో ఉదాసీనంగా ఉండలేకపోయారు. తొలగింపును సవాలు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) వెళ్లారు. రతన్ టాటాతో పాటు టాటా సన్స్‌లోని మరో 20 మందిపైనా తన రెండు ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలైన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల ద్వారా కేసు దాఖలు చేశారు. అయితే ఈ ఆరోపణలను పరిశీలించడానికి సైతం అర్హత లేదని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. అయితే మిస్త్రీ ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లారు. మూడేళ్ల న్యాయపోరాటంలో గెలుపు సైరస్ మిస్త్రీని వరించింది. ఆ తర్వాత టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
ఇవీ చూడండి:రూ.80 లక్షల కోట్లకు చిప్‌సెట్ మార్కెట్.. డిజైన్ సేవలకూ గిరాకీ
త్వరలోనే డిజిటల్ కరెన్సీ.. పైలట్ ప్రాజెక్టు కోసం ఆర్బీఐ చర్చలు