భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం.. దేశయంగా తొలిస్థానంలో ఉన్న రిలయన్స్, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. ఒక భారత సంస్థకు ఇదే అత్యుత్తమ ర్యాంకు. 800 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా అగ్రస్థానంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ నిలిచింది. తర్వాతి స్థానాలను అమెరికా సంస్థలు మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ దక్కించుకున్నాయి. అమెరికా కంపెనీలే రెండు నుంచి పన్నెండు స్థానాలను పొందాయి. జర్మనీ వాహన దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్ 13వ స్థానంలో ఉంది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 14, ఫ్రాన్స్ సంస్థ డెకాథ్లాన్ 15వ స్థానాల్లో నిలిచాయి.
- జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, అమెరికా పానీయాల సంస్థ కోక-కోలా, జపాన్ వాహన దిగ్గజాలు, హోండా, యమహా, సౌదీ చమురు సంస్థ అరామ్‌కో వంటి సంస్థల కన్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన స్థానం పొందింది.
- ఈ జాబితాలో మన దేశం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (137వ స్థానం), బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూప్ (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్ అండ్ టీ (354), ఐసీఐసీఐ బ్యాంక్ (365), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (455), ఎస్‌బీఐ (499), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ఉన్నాయి.
- ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేసే గ్రేట్ రిజిగ్నేషన్ కొనసాగగా, కొవిడ్-19 పరిణామాలు కార్యాలయాల పనితీరును మార్చేశాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, అవకాశాలు, పని-జీవన సమతౌల్యతకు ఉద్యోగులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది.
- 57 దేశాల నుంచి 1,50,000 మంది పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.