తెలంగాణ

telangana

ETV Bharat / business

'అదే రేటు.. తక్కువ బరువు'.. కంపెనీల వ్యూహాలు!

FMCG products rates cut: ఉత్పత్తుల ధరలు పెంచితే అమ్మకాలు తగ్గిపోతాయన్న భావనతో కంపెనీలు కొత్త దారుల్లో వెళ్తున్నాయి. ఖర్చుల భారానికి అనుగుణంగా ప్యాకెట్ల ధరలు పెంచకుండా, సరకు పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి.

FMCG cut pack volume and weight
FMCG cut pack volume and weight

By

Published : May 22, 2022, 5:01 AM IST

FMCG products weight cut: మీరు వాడే మాయిశ్చరైజర్‌ త్వరగా ఖాళీ అయిపోతోందా.. ఇష్టంగా తినే చిప్స్‌ ప్యాకెట్‌లో కొన్నే ఉంటున్నాయా.. ఇలాంటి వాటికి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే తయారీ సంస్థలు పెరిగిన ముడిపదార్థాలు, ప్యాకేజింగ్‌, రవాణా ఖర్చుల భారానికి అనుగుణంగా ప్యాకెట్ల ధరలు పెంచకుండా, ఆయా ప్యాకెట్లలో సరకు పరిమాణాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. ఇటీవల పలు కంపెనీలు నూడుల్స్‌, సబ్బులు, చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఉత్పత్తుల ధరలను కొనసాగించడానికి పరిమాణం తగ్గించేశాయి. క్యాన్‌ల తయారీ కోసం రీసైకిల్‌ చేసిన అల్యూమినియం వాడటం, ప్రకటనలు, మార్కెటింగ్‌ ఖర్చులు, కొత్త ఉత్పత్తుల విడుదల వాయిదా వేయడం వంటివి చేస్తున్నాయి.

మార్జిన్ల క్షీణతే నిదర్శనం
ధరల పెరుగుదల ధాటికి సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ఇదే సమయంలో ముడివస్తువుల ధరలు భారీగా పెరిగినా, ఆ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే విక్రయాలు క్షీణిస్తాయనే భావనతో తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కొంతమేర పెంచుతున్నాయి. ఫలితంగా కంపెనీల మార్జిన్‌లు పడిపోయినట్లు మార్చి త్రైమాసిక ఫలితాల్లో స్పష్టమైంది. తయారీ, సరకు రవాణా, ప్యాకేజింగ్‌ వ్యయాలు అధికమైనందున ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఇప్పటికే సబ్బుల నుంచి వంట నూనెలు, బిస్కెట్‌ల వరకు అన్నింటి ధరలు ఎంతో కొంత పెంచాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తుల తయారీలో పామాయిల్‌ కీలక ముడి పదార్థం. ఈ ధర కనుక కాస్త తగ్గితే, కంపెనీలకు ఉపశమనం కలుగుతుంది.

చిన్న ప్యాకెట్‌లే ముద్దు
సాధారణంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు గ్రామీణ, సామాన్య వినియోగదారులే లక్ష్యంగా తక్కువ ధర, చిన్న పరిమాణంలో తమ ఉత్పత్తుల ప్యాకెట్‌లను విక్రయిస్తాయి. పట్టణాలు, నగరాల్లో తలసరి ఆదాయం అధికంగా ఉండటం వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ పెద్ద ప్యాకెట్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి. అయితే ధరల పెరుగుదల నేపథ్యంలో, ఇంటి బడ్జెట్‌ను అదుపులో ఉంచేందుకు పట్టణ వినియోగదారులూ ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి పెద్ద ప్యాకెట్‌ కొనుగోలు చేయకుండా.. తక్కువ యూనిట్‌ ధర (ఎల్‌యూపీ) ఉండే చిన్న ప్యాక్‌లకు మొగ్గుచూపుతున్నారు. కంపెనీలు చిన్న ప్యాకెట్ల ధరలు పెంచకుండా.. వాటిలో సరకు పరిమాణం తగ్గిస్తున్నాయి. రూ.1, రూ.5, రూ.10 వంటి ధరల్లోనే ఆయా ఉత్పత్తులను అందించేందుకు ఇలా చేస్తున్నాయి. కొన్ని పెద్ద ప్యాక్‌లపై ధరలు పెంచడంతో పాటు సరికొత్తగా మధ్యశ్రేణి ప్యాక్‌లను తీసుకొస్తున్నాయి.

పెద్ద కంపెనీలు సైతం
వ్యయాల నియంత్రణకు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు హెచ్‌యూఎల్‌, మారికో, డాబర్‌, ఇమామీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌లు తీవ్రంగా కష్టపడుతున్నాయి. చిన్నవి, పెద్ద ప్యాక్‌ల మధ్యలో సరికొత్త బరువులో ప్యాక్‌లను ఆవిష్కరిస్తున్నట్లు హిందుస్థాన్‌ యునిలీవర్‌ చెబుతోంది. మార్చి త్రైమాసిక మొత్తం అమ్మకాల్లో చిన్ని ప్యాక్‌ల వాటా 24 శాతంగా ఉందని, మధ్య స్థాయి ప్యాక్‌ల అమ్మకాలుపెరిగాయని ఇమామీ వెల్లడించింది. గత ఆరు నెలల్లో పార్లే ప్రోడక్ట్స్‌ సంస్థ 7-8 శాతం ధరలు పెంచింది. పార్లే-జి, క్రాక్‌ జాక్‌ బ్రాండ్ల పేరిట బిస్కట్‌లు విక్రయించే ఈ సంస్థ ప్యాకెట్‌లో గ్రాములను తగ్గించి, ధరలు సైతం అధికం చేసింది. మిఠాయిలు, స్నాక్స్‌ విక్రయించే సంస్థలు కూడా ఇవే చర్యలు చేపడుతున్నాయి. దీంతో ప్లాస్టిక్‌ వినియోగంతో పాటు ప్యాకేజింగ్‌, రవాణా ఖర్చులు కూడా తగ్గుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో వ్యయ నియంత్రణ చర్యలను బ్రిటానియా రెట్టింపు చేసింది. ముడివస్తువులను సమీప ప్రాంతాల నుంచి సమీకకరించడంపై దృష్టి పెట్టింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details