తెలంగాణ

telangana

ETV Bharat / business

'అది రూపాయి పతనం కాదు.. డాలర్ బలపడటం'.. నిర్మలా సీతారామన్

రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డాలర్‌ విలువ బలపడుతున్నందునే.. రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని ఆమె వివరించారు.

NIRMALA SITHARAMAN
NIRMALA SITHARAMAN

By

Published : Oct 16, 2022, 7:48 PM IST

రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోసారి స్పందించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్లు చెప్పారు. రూపాయి విలువ మరింత తగ్గిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం డాలర్‌ విలువ బలపడుతున్నందున రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని ఆమె వివరించారు. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ఆమె.. దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూపాయి స్థిరత్వం కోల్పోకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

అంతర్జాతీయంగా క్రయ విక్రయాలన్ని దాదాపు అమెరికన్‌ డాలర్లతో ముడిపడి ఉంటాయని, అందువల్ల డాలర్‌ విలువ పెరిగితే దాని ప్రభావం అన్ని దేశాల కరెన్సీలపైనా పడుతుందని సీతారామన్‌ వివరించారు. ప్రస్తుతం డాలర్‌ విలువ క్రమంగా పెరుగుతున్నందువల్ల రూపాయి విలువ తగ్గినట్లనిపిస్తోందని వివరించారు. 'రూపాయి పతనమవుతోందని నేను అనుకోవట్లేదు. డాలర్ బలపడుతోంది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గానే ఉంది. రూపాయి అస్థిరతను తగ్గించేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేపడుతోంది. అలాగని మార్కెట్‌లో జోక్యం చేసుకోకూదు. రూపాయి విలువ మరీ పతనం కాకుండా చూసుకోగలినట్లయితే తిరిగి పుంజుకోవడం ఖాయం' అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనే కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు ఏర్పడినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.69 జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details