Fitch India Rating: ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాను 7 శాతానికి తగ్గించింది. జూన్‌లో 7.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఫిచ్.. తాజాగా దానిని సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాను కూడా తగ్గించింది. గతంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఫిచ్.. తాజాగా దానిని 6.7 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు.. అధిక ద్రవ్యోల్బణం, ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలను వెల్లడించినట్లు ఫిచ్ తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటును 18.5 శాతంగా గతంలో అంచనా వేసినప్పటికీ.. అది 13.5 శాతానికే పరిమితమైనట్లు గుర్తుచేసింది.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇదీ..
ప్రపంచవ్యాప్తంగా 2022-23లో జీడీపీ 2.4 శాతంగా ఉంటుందని ఫిచ్ లెక్కగట్టింది. జూన్ అంచనాలతో పోలిస్తే 0.5 శాతం కోత విధించింది. వచ్చే ఏడాది వృద్ధి రేటులోనూ ఒక శాతం కోతపెట్టి 1.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. యూరోప్రాంతం, యూకే ఈ ఏడాది చివరకు ఆర్థికమాంద్యంలోకి జారుకుంటాయని ఫిచ్ వెల్లడించింది. అమెరికా 2023 మధ్య నాటికి స్వల్ప మాంద్యంలోకి వెళ్తుందని చెప్పింది.