Digital Rupee RBI : డిజిటల్ రూపాయిని(హోల్‌సేల్) నవంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 'సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)'గా వ్యవహరించే డిజిటల్ రూపాయి లావాదేవీలను మంగళవారం ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీస్‌లోని సెకండరీ మార్కెట్ లావాదేవీలకు మొదటి డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా వినియోగించనుట్లు పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్ర బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకును పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పింది. నెల రోజుల వ్యవధిలోనే రిటైల్ రంగంలోనూ డిజిటల్ రూపాయిని ప్రారంభిస్తామని ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తూ.. చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు, అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు 'డిజిటల్ రూపాయి' తీసుకువస్తోంది ఆర్‌బీఐ.
రెండు రకాలుంటాయ్..
సీబీడీసీలో ఒకటి సాధారణ లేదా రిటైల్ (సీబీడీసీ-ఆర్) అవసరాలకు వినియోగించేది అయితే, మరొకటి టోకు (సీబీడీసీ-డబ్ల్యూ) అవసరాలకు వినియోగించేలా వర్గీకరిస్తారు. రిటైల్ సీబీడీసీని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు సీబీడీసీని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగిస్తాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 60 కేంద్ర బ్యాంకులు సీబీడీసీపై ఆసక్తి చూపాయని ఆ కాన్సెప్ట్ నోట్ పేర్కొంది.
ఎందుకు తీసుకొస్తున్నారంటే..
- ప్రస్తుత కరెన్సీ నోట్లు, నాణేల నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి
- నగదు చెలామణీ తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థను సాధించడానికి
- చెల్లింపుల్లో పోటీ, సామర్థ్యం, వినూత్నత పెంచడానికి
- విదేశీ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి
- క్రిప్టో ఆస్తుల నుంచి సామాన్యులను రక్షించి.. దేశీయ కరెన్సీపై విశ్వాసం పెంచడానికి
ఇప్పుడూ డిజిటల్ రూపంలో నగదు ఉంది కదా..
ప్రస్తుతం మన నగదును డిజిటల్ రూపంలోకి మార్చుకుని, వినియోగించుకుంటున్నాం. ఈ చెల్లింపులకు బాధ్యత వాణిజ్య బ్యాంకులది అయితే, సీబీడీసీ చెల్లింపులకు ఆర్‌బీఐ బాధ్యత వహిస్తుంది.