First Electric Highway In India : నాగ్‌పుర్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రైవేట్ రంగ పెట్టుబడిదార్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని దిల్లీలో జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో గడ్కరీ తెలిపారు. పైగా ఈ తరహా రహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్‌ను ఇవ్వడం విద్యుత్ మంత్రిత్వ శాఖకూ పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు.
'నేను విద్యుత్ మంత్రిత్వ శాఖతో మాట్లాడాను. ఒక్కో యూనిట్ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా నేను ప్రయత్నిస్తున్నాను. వాణిజ్యంగా ఈ ధర రూ.11గా ఉంది' అని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ తీగల నిర్మాణం ప్రైవేట్ రంగ పెట్టుబడిదార్లు చేపడతారని.. టోల్ మాదిరిగా విద్యుత్ ఛార్జీని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ) వసూలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. కాగా.. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను నాగ్‌పుర్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని గడ్కరీ అన్నారు. అయితే దిల్లీ- జయపుర మధ్య దేశంలోనే మొట్టమొదటి విద్యుత్ హైవేను నిర్మించాలన్నది తన కల అని అంతకుముందు గడ్కరీ వెల్లడించడం గమనార్హం.
విద్యుత్ రహదార్లు అంటే..
విద్యుత్ రైళ్ల పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన విద్యుత్ సరఫరా తీగలు ఉంటాయో ఆ తరహాలోనే రహదారులపైనా తీగలను అమరుస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే విద్యుత్ సాయంతో రహదారులపై నడుస్తాయి. ఆ విధంగా వాహనాల్లోనూ, విద్యుత్ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.