తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇవి పాటిస్తే ఆర్థిక ఒత్తిడి దూరం.. - financial stress avoid plans

financial stress avoid plans: ఆరోగ్యమే మహా భాగ్యం అనే మాట వింటూనే ఉంటాం. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ డబ్బు అవసరం ఎంతో ఉంది. ఆర్థికారోగ్యం బాగున్నప్పుడే.. అనుకున్నవన్నీ సాధించగలం. క్రమం తప్పని వైద్య పరీక్షలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లే.. మన ఆర్థిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమూ అవసరం.

financial pressures
ఆర్థిక ఒత్తిడిని జయిద్దాం

By

Published : Apr 9, 2022, 3:08 PM IST

financial stress avoid plans: ఒక సర్వే ప్రకారం.. ఆర్థిక అస్థిరత ఎంతో మందిలో ఒత్తిడికి కారణం అవుతోంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలూ వస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఇది మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కచ్చితమైన ఆర్థిక ప్రణాళికలే ఈ ఒత్తిడిని దూరం చేయగలవు.

  • పిల్లల చదువులు, వారి వివాహం, పదవీ విరమణ ప్రణాళికలు:అనుకోనిదేమైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసా.. ఇలా ఎన్నో లక్ష్యాలు.. వాటిని సాధించేందుకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలాంటివి కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంటాయి. కానీ, ఒక ప్రణాళికతో వెళ్లినప్పుడు.. దీన్ని తట్టుకునే శక్తిని సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. దీనికి కొన్ని సూత్రాలను పాటిస్తే చాలు..
  • 30 శాతం: మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు.. అందులో ఎంత మిగులుస్తున్నారన్నదే కీలకం. భవిష్యత్‌లో ఆర్థిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలంటే.. ఆర్జించిన డబ్బులో 30 శాతం తప్పనిసరిగా పొదుపు చేయాలి. దీనికి మించి దాస్తే ఇంకా శ్రేయస్కరం.
  • అత్యవసరం వస్తే: ఖర్చులు ఎప్పుడూ చెప్పి రావు. అందుకే, అత్యవసరాల్లో ఆదుకునేలా కొంత మొత్తం దాచుకోవాలి. వార్షిక ఆదాయంలో కనీసం 15 శాతం వరకూ లేదా కనీసం 3 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. బ్యాంకు పొదుపు ఖాతా, లిక్విడ్‌ ఫండ్ల వంటి వాటిల్లో ఈ మొత్తం ఉండాలి.
  • 50 శాతం మించకుండా: మీ ఆస్తుల విలువతో పోలిస్తే అప్పులు ఎప్పుడూ 50 శాతానికి మించకూడదు. ఒకసారి మీ ఆస్తులు, అప్పుల పట్టిక వేసుకోండి. ఉండాల్సిన నిష్పత్తికి మించి ఉంటే.. వాటిని ఎలా తగ్గించుకోవాలన్న ఆలోచనలు సిద్ధం చేసుకోవాలి.
  • 40 శాతానికి తక్కువే: నెలకు వస్తున్న ఆదాయంలో 40 శాతం లోపే ఈఎంఐలు ఉండాలి. అంతకుమించితే.. ఆర్థికంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంది. ఇందులో క్రెడిట్‌ కార్డు చెల్లింపులనూ లెక్కలోకి తీసుకోవాలి.
  • బీమాతో: వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ జీవిత బీమా ఉండాలి. దీనికి అప్పులు, ఇతర బాధ్యతలనూ కలిపి సరైన మొత్తానికి బీమా తీసుకోవాలి. కుటుంబం అంతటికీ కలిపి రూ.10లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా తీసుకోవడం మర్చిపోవద్దు.
  • పిల్లల చదువులు: పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడులు కొనసాగించాలి. అవసరమైన మొత్తం, ఉన్న వ్యవధి ఆధారంగా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. క్రమానుగత పెట్టుబడులతో ముందడుగు వేయాలి.

కేవలం ఆర్థిక ప్రణాళికలు వేసుకున్నంత మాత్రాన భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడిని పూర్తిగా జయించలేం. కానీ, సాధ్యమైనంత మేరకు చిక్కులను ఎదుర్కొనేందుకు మార్గాన్ని నిర్మించుకోవచ్చు. అదే మనకి ధైర్యాన్ని ఇస్తుంది.

- వికాస్‌ సింఘానియా, సీఈఓ, ట్రేడ్‌స్మార్ట్​

ఇదీ చదవండి:మళ్లీ పెరిగిన బంగారం ధర... ఏపీ, తెలంగాణలో ఇలా..

ABOUT THE AUTHOR

...view details