తెలంగాణ

telangana

ETV Bharat / business

సరికొత్త ఆర్థిక ప్రణాళికతో 2023కు సిద్ధమా? - మ్యూచువల్ ఫండ్​లలో పెట్టుబడులు

కొత్త ఏడాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. రాబోయే ఏడాదిలో ఏం చేయాలన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతకు ముందు ఈ ఏడాది పూర్తి చేయాల్సిన పనుల మాటేమిటి? వాటన్నింటినీ ఒకసారి సమీక్షించుకోవాల్సిన తరుణమిది. అవేమిటో తెలుసుకుందామాం.

financial planning strategies
ఆర్థిక ప్రణాళికలు

By

Published : Dec 25, 2022, 3:00 PM IST

ఆర్థిక ప్రణాళిక ఒక రోజుతో పూర్తయ్యే పనికాదు. ఎప్పటికప్పుడు మనం ఏం సాధించాం? ఏం సాధించాలి? అనే లెక్కలు వేసుకుంటూ సాగిపోతూ ఉండాలి. కొత్త ఏడాదిలో ప్రణాళికలు గత ఏడాది అనుకున్న ఆలోచనల పునాదుల నుంచే మొదలు పెట్టాలి. 2023లోకి ప్రవేశించే ముందు ఈ ఎనిమిది అంశాలను పూర్తి చేశారా లేదా ఒకసారి చూసుకోండి.

అత్యవసర నిధి..
అనుకోని ఖర్చులు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో తెలియదు. దానికి సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన ముఖ్యమైన పని. మరి 2022లో దీన్ని పాటించారా? కనీసం ఆరు నెలల ఖర్చులను మీ అత్యవసర నిధి కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. పొదుపు ఖాతా, లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మిశ్రమంగా ఈ మొత్తం ఉండాలి. మరి, ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఎంత నిధి ఉందో లెక్క తీశారా? మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ఏం చేయాలో ఆలోచించండి.

త్వరగా ప్రారంభించాలి..
ఈ ఏడాది ప్రారంభంలో పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏమిటి? దానిని ఎంత వరకూ పాటించారో ఒకసారి చూడండి. మదుపు నిర్ణయాన్ని ఎప్పుడూ వాయిదా వేయకూడదు. ఎంత పెట్టుబడి పెట్టారనేది కాదు. ఎంత కాలం కొనసాగారు అనేదానిపైనే లాభాలు ఆధారపడి ఉంటాయి. అప్పుడే, దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు వీలవుతుంది. జనవరిలో తీసుకున్న నిర్ణయాన్ని డిసెంబరులోనైనా ఆచరణలో పెట్టండి. ఈ ఏడాదిలో తీసుకున్న నిర్ణయం వాయిదా వేశాం అనే మాట రాదు.

మదుపు పెంచాలి..
మీరు నెలకు రూ.10వేలతో మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించారనుకుందాం. దీన్ని కనీసం 5-10 శాతం వరకూ పెంచేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని వేగంగా సాధించేందుకు వీలవుతుంది.

పన్ను ప్రణాళిక పూర్తయ్యిందా..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను మినహాయింపు కోసం అనువైన పథకాల్లో మదుపు చేయాలి. ఈ 9 నెలల కాలంలో మీరు దీనికోసం ఏం చేశారు, ఏయే పథకాల్లో ఎంత మేరకు మదుపు చేశారో చూసుకోండి. ఆర్థిక సంవత్సరానికి ఇంకా మూడు నెలలు ఉంది. ఈ లోపు పెట్టుబడులు పూర్తి చేయాలి. ఏప్రిల్‌ 2023 నుంచి నెలకు కొంత మొత్తాన్ని పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయడం అలవాటు చేసుకోండి.

భావోద్వేగాలతో వద్దు..
పెట్టుబడులు ఎప్పుడూ దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి. చాలామంది మదుపరులు సంపదను సృష్టించలేకపోవడానికి ముఖ్య కారణం వారిలోని భయం, భావోద్వేగాలే. ఈక్విటీలు పడిపోగానే ఆందోళనతో విక్రయిస్తారు. పెరుగుతున్నప్పుడు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌లో విజయం సాధించాలనుకుంటే వివిధ దశల్లో మనం స్థిరంగా పెట్టుబడులను కొనసాగించాలి. ఇప్పుడు మార్కెట్‌ కాస్త హెచ్చుతగ్గులతో కనిపిస్తుంది. కాబట్టి, మీ పెట్టుబడులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతగా పట్టించుకోకండి.

లక్ష్యాలు నెరవేరేలా..
మీ లక్ష్యాలేమిటో నిర్దేశించుకోండి. జనవరిలో రాసుకున్న వాటికి, ఇప్పుడు వీటిలో ఏమైనా మార్పులున్నాయా చూసుకోండి. దాని ప్రకారం పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక చేసుకోండి. డెట్‌, హైబ్రీడ్‌ వంటి స్వల్పకాలిక పెట్టుబడులు 5 ఏళ్లకంటే తక్కువ లక్ష్యాల కోసం ఎంచుకోవాలి. ఈక్విటీ ఫండ్లు అయిదేళ్లకు మించి వ్యవధి ఉన్నప్పుడే అనుకూలం అని గుర్తించండి.

వైవిధ్యంగా..
ఈక్విటీ, డెట్‌, బంగారం, స్థిరాస్తి, అంతర్జాతీయ ఫండ్లు ఇలా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలి. మీ నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఒక్కో విభాగానికి ఎంత శాతం పెట్టుబడి కేటాయించాలన్నది నిర్ణయించుకోవాలి. పెట్టుబడుల పనితీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని మీరు అనుకున్న ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. వీటిని గుర్తించండి. కొత్త ఏడాదిలో మీ పెట్టుబడులు ప్రారంభించేందుకు ముందు ఎంత వైవిధ్యంగా పెట్టుబడులు ఉన్నాయన్నది సమీక్షించుకోండి.

ధీమాగానే ఉన్నారా?
ఈ ఏడాది ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయినందుకు ఆనందించండి. కానీ, ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. మీ బీమా పాలసీలను ఒకసారి సమీక్షించుకోండి. కుటుంబ ఆర్థిక భద్రత కోసం టర్మ్‌ పాలసీ తీసుకోండి. కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా (ఫ్లోటర్‌) కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది.

'డబ్బుతో మన ప్రవర్తన ఎలా ఉంది'.. సంపదను సృష్టించడంలో ఇదే కీలకం. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు.
--సతీష్‌ ప్రభు, హెడ్‌-కంటెంట్‌ డెవలప్‌మెంట్‌- ఇండియా, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌

ABOUT THE AUTHOR

...view details