Financial Planning: మనం ఎన్నో ఆలోచిస్తుంటాం. అందులో కొన్ని ఊహలు ఉండొచ్చు. మరికొన్ని వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండొచ్చు. ఆర్థిక ప్రణాళికల విషయంలో ఊహలు, అంచనాలు ఎప్పుడూ పనికిరావు. ఇక్కడ అంకెలన్నీ వాస్తవాలుగానే ఉంటాయి. మీరు ఆర్జించే వేతనం ఎంత? ఉన్న ఖర్చులేమిటి? భవిష్యత్ కోసం ఎంత కూడబెట్టాలి?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే చాలు. వాస్తవానికి దూరంగా ఉన్న ప్రణాళికతో ముందుకెళ్లడం అసాధ్యం. ఉదాహరణకు మీరు సంపాదించిన మొత్తంలో 25 శాతం వరకూ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారునుకుందాం. కాస్త ఖర్చులను నియంత్రించుకుంటే.. ఇది సాధ్యమే. కానీ, 50 శాతం పెట్టుబడులు పెట్టి, మిగతాది ఖర్చు చేస్తామంటే.. చాలా సందర్భాల్లో అసాధ్యం కావచ్చు. ఇలాంటి అంచనాలతో ఆర్థిక ప్రణాళిక రచించినా.. అది దెబ్బతింటుంది. కానీ, ఆచరణలోకి రాదు.
కోరికలు గెలిస్తే..:
15 ఏళ్ల తరువాత మీ పిల్లల చదువు కోసం అవసరమైన డబ్బును జమ చేయాలన్నది మీ ఆలోచన. దీనికి నెలకు రూ.10వేలు మదుపు చేస్తున్నారనుకుందాం. అదే సమయంలో కారు కొనాలనే కోరిక కలిగింది. దీనికి ఈఎంఐ రూ.9,500 మాత్రమే.. ఏడేళ్లు చెల్లిస్తే సరిపోతుంది కదా.ఇది పూర్తయ్యాక.. పిల్లల చదువు కోసం అవసరమైతే నెలకు రూ.20వేలు జమ చేద్దాం అనుకోవచ్చు. దీనివల్ల మీరు పిల్లల చదువుల కోసం 15 ఏళ్ల వ్యవధిలో జమ చేయాలనుకునే మొత్తాన్ని 8 ఏళ్లలోనే చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో నెలకు రూ.20వేలు మదుపు చేసినా.. ఆశించిన మొత్తాన్ని అందుకోవడం కష్టం కావచ్చు. దీర్ఘకాలంలో అందే చక్రవడ్డీని కోల్పోయే ఆస్కారం ఉంది. మరి, కారు కొనాలనే కోరిక తీరేదెలా.. అందుకు తగ్గ ఆదాయం సమకూర్చుకొని, దానికోసం ప్రత్యేక బడ్జెట్ వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.
క్రమశిక్షణ లేకపోవడం..:
ఆలోచన ఉన్నంత బలంగా ఆచరణ ఉండకపోవచ్చు. చాలామంది ఆర్థికంగా చితికిపోవడానికి ఇదే కారణం అవుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఆ మేరకు కొంత ఖర్చులు పెరగడం సహజం. ఇదే సమయంలో పెట్టుబడులూ ఆ మేరకు పెంచుకోవాలి. ఏదో ఖర్చు వచ్చిందని సిప్‌ను ఆపేయడంలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. ఆర్థిక ప్రణాళికను కనీసం ఏడాదికోసారైనా సమీక్షించుకోవాలి. అనుకున్నట్లుగానే పెట్టుబడులు పెడుతున్నామా.. ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది గుర్తించి, వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి.