Financial Planning And Wealth Management :సాధారణంగా చాలామంది తమ రోజువారీ జీవితంలో అనేక ఖర్చులు చేస్తుంటారు. ఇందులో అవసరమైన ఖర్చులేంటి? అనవసర ఖర్చులేంటి? అనే విషయంలో కొంతమందికి సందేహం ఉండవచ్చు. అనవసరమైన ఖర్చుల విషయంలో స్పష్టత లేకపోతే జీవితాంతం అవి మనల్ని వదలిపెట్టవు. మనీ మేనేజ్మెంట్ చిన్నతనం నుంచి సరిగ్గా అలవర్చుకోకపోతే కొంతకాలానికి సంక్లిష్టంగా మారుతుంది. చాలా మంది ఆర్థిక ప్రణాళికలో చేసే మొదటి తప్పు తమ ఖర్చులను అదుపులో పెట్టకపోవడమే. లైఫ్స్టైల్లో మార్పులు చేయకుంటే ఈ ఖర్చులను అదుపులో ఉంచడం చాలా కష్టం. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేలా ఇది దీర్ఘకాలంలో సహాయపడుతుంది. ఖర్చులు మరీఎక్కువైతే అప్పులు చేయడం తప్ప వేరే మార్గం కనిపించదు. చాలా మంది చేసే ఆర్థిక తప్పుల, నివారణ మార్గాలేంటో తెలుసుకుందాం.
Family Budget Planner :చాలామంది ఇంటి ఖర్చుల విషయంలో ప్యామిలీ బడ్జెట్‌ను తయారు చేసుకోరు. బడ్జెట్ తయారు చేసుకున్న వారు కూడా కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ఇందులో బడ్జెట్ రాయకపోవడమే అతి పెద్ద తప్పు. బడ్జెట్ ప్రణాళిక రాసినప్పుడు.. ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎంతమేరకు చేయవచ్చు? అనే అంశాలపై మనకు స్పష్టత ఉంటుంది. అలాగే, ద్రవ్యోల్బణాన్ని (ధరలపెరుగుదలను) అంచనా వేయకుండా బడ్జెట్ తయారు చేస్తుంటారు. భవిష్యత్ ఖర్చులను కూడా అంచనా వేసినప్పుడే బడ్జెట్ సరైన విధంగా ఉంటుంది. చాలా మంది మొదట్లో ఆసక్తితో బడ్జెట్ రాయడం మొదలు పెడతారు. కానీ 1-2 నెలల స్వల్పకాలంలోనే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం పాటు రాస్తుంటేనే మనం చేసే ఖర్చుల మీద అవగాహన వస్తుంది. తద్వారా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు.
అనవసరమైన సబ్‌స్క్రిప్షన్స్
కొంత మంది ఓ సంవత్సరానికని జిమ్, క్లబ్ ఫీజులు చెల్లించి సక్రమంగా హాజరు అవ్వరు. దీనివల్ల దానిపై చేసిన ఖర్చు అనవసరంగా వృథా అవుతుంది. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్‌లు(టీవీ,ఓటీటీ) విషయంలోను ఇదే జరుగుతుంది. టీవీలో అన్ని ఛానళ్లను చూడకపోయినా సరే ఎక్కువ ఛానళ్లకు డబ్బు చెల్లిస్తుంటారు. మీరు రోజూ ఎక్కువగా చూసే ఛానళ్లను మాత్రమే ఎంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. తద్వారా డబ్బు ఆదా అవుతుంది. మరికొంత మంది చదవకపోయినా సరే పలు రకాల మ్యాగజైన్స్‌ను ఇంటికి తెప్పిస్తారు. మీరు ఎక్కువ చదవగలిగే వాటినే తీసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.
ఇంటి ఖర్చులు
ఇల్లు అనేది ఎవరికైనా కనీస అవసరం. ప్రాథమిక అవసరాలను తీర్చేది కూడా ఇల్లే. చాలామంది అధికంగా అద్దె చెల్లించి సిటీ మధ్యలో ఇరుకు ఇళ్లలో నివసిస్తుంటారు. దీనికి బదులుగా పట్టణ శివారుకు ప్రాంతానికి మారడమే మంచిది. దీనివల్ల అద్దె కలిసి వస్తుంది. ఇల్లు సౌకర్యంగానూ ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసినా అందుబాటు ధరకు లభించే శివారు ప్రాంతాలకు వెళ్లడమే మంచిది. దీనివల్ల కొనుగోలు చేసే మొత్తంలో ఎక్కువ డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. మెట్రో లాంటి అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ ద్వారా వేగంగా దూర ప్రాంతాలకు చేరుకోవచ్చు.
'కరెంట్ పొదుపు పాటిస్తే మంచిది'
ప్రస్తుత కాలంలో కరెంట్ వినియోగం సర్వసాధారణం. అంతేకాకుండా, అవసరాల రీత్యా విద్యుత్‌తో పనిచేసే ఉపకరణాలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో వాడకం కూడా క్రమంగా పెరిగింది. వీటిని పొదుపుగా ఉపయోగిస్తే పర్వాలేదు. కానీ, మనుషులు లేని చోట కూడా కొన్నిసార్లు ఫ్యాన్, ఏసీ, లైట్లు వేసేసి ఉంచేస్తారు. అంతేకాకుండా ఇంటికి అనవసర లైటింగ్ ఎఫెక్ట్‌లను డెకరేట్ చేస్తుంటారు. ఇలాంటి అనవసర ఖర్చులను చాలామంది సరిగ్గా గమనించరు. కరెంట్ విషయంలో మీరు ఒక యూనిట్‌ను పొదుపు చేస్తే.. అదనపు యూనిట్‌ను ఉత్పత్తి చేసినట్టే. అంతేకాకుండా, విద్యుత్ ఛార్జీలు గతంతో పోలిస్తే ప్రస్తుతకాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. దేశంలో దాదాపుగా అందరూ విద్యుత్ వినియోగదారులే. కనుక విద్యుత్‌ను ఆదా చేసి వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. వీలైతే విద్యుత్ వ్యయాలను తగ్గించుకోవడానికి సోలార్ పానెల్స్ అమర్చుకోవాలి.