తెలంగాణ

telangana

ETV Bharat / business

Financial planning : కొత్తగా సంపాదించ‌డం స్టార్ట్ చేశారా?.. ఈ 5 ఫైనాన్సియల్ మిస్టేక్స్​ చేయ‌కండి!

Financial planning : కొత్త‌గా ఉద్యోగంలో చేరిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నో ల‌క్ష్యాలు నిర్దేశించుకుంటారు. డ‌బ్బు ఆదా చేసుకోవాలి, ఖ‌ర్చు త‌గ్గించాలి, ఇష్ట‌మున్నవి కొనుక్కోవాలి.. ఇలా ఏవేవో అనుకుంటారు. మ‌రి వీటిని నెర‌వేర్చుకోవాలంటే ఈ 5 ఫైనాన్సియల్ మిస్టేక్స్​ చేయ‌కండి.

Financial Planning after getting Job
How to plan finances from Your First Job

By

Published : Jun 27, 2023, 1:01 PM IST

Financial planning : చ‌దువు పూర్తి చేసుకున్న ప్ర‌తి ఒక్కరూ ఏదో ఒక కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తారు. అది చిన్న‌దైనా, పెద్ద‌దైనా స‌రే. సొంతంగా సంపాదించ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఎన్నో అనుకుంటారు. ఇంట్లో డబ్బులు ఇవ్వాలి, ఇష్ట‌మైనవి కొనుక్కోవాలి, దుబారా ఖ‌ర్చు త‌గ్గించాలి అని ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటారు. మ‌రి వీట‌న్నింటినీ స‌మ‌ర్థంగా నిర్వ‌హించుకోవ‌డానికి మొదటి జీతం తీసుకున్నప్ప‌టి నుంచే 5 ఆర్థిక ప‌ర‌మైన త‌ప్పులు చేయ‌కూడ‌దు.

1. అతిగా ఖర్చు చేయ‌డం :
Controlling unnecessary expenses : చాలా మంది సొంతంగా సంపాదించ‌డం ప్రారంభించిన త‌ర్వాత త‌మ కోరిక‌లు తీర్చుకోవ‌డానికి ప్రాధాన్య‌మిస్తారు. బ్రాండెడ్ దుస్తులు, ఖ‌రీదైన ఫోన్లు, సొంత వాహ‌నం కొన‌టం లాంటివి చేస్తారు. కానీ ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల స్టార్టింగ్​లోనే ఆర్థిక భారం ప‌డుతుందని టీమ్ లీజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ రితుప‌ర్ణ చ‌క్ర‌వ‌ర్తి అన్నారు. బ‌య‌టి ప్రాంతాల్లో ఉండి ప‌నిచేస్తే.. ఇంటి అద్దె విష‌యంలోనూ కొంద‌రు అధికంగా ఖర్చు చేస్తారని ఆయ‌న తెలిపారు. అలాంటి వారు సొంతంగా రూమ్ తీసుకోకుండా షేరింగ్ లేదా పేయింగ్ గెస్ట్ రూముల్లో ఉంటే మంచిదని అని సూచించారు.

2. త‌గినంత పొదుపు చేయ‌క‌పోవ‌డం :
దుబారా ఖ‌ర్చు మ‌న ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌ను చేరుకోవ‌డంలో అడ్డంకిగా మారుతుంది. జాబ్ చేయ‌డం స్టార్ట్​ చేసిన‌ప్ప‌టి నుంచే దుబారా ఖ‌ర్చు మాని, మ‌న‌కు వచ్చే జీతంలో క‌నీసం 25 శాతం పొదుపు చేసుకోవాల‌ని చ‌క్ర‌వ‌ర్తి సూచించారు. మ‌నకొచ్చే ప్ర‌తి నెల వచ్చే జీతంలో 20 - 30 శాతంతో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాల‌ని ప‌లువురు ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోడానికి ఇది ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

3. ప‌న్ను విధానాలు, చిక్కులు అర్థం చేసుకోక‌పోవ‌డం :
Basics of Income Tax for Beginners : ఉద్యోగం చేయ‌డం ప్రారంభించిన మొద‌ట్లోనే టాక్స్​ సంబంధిత విష‌యాల‌పై అవ‌గాహ‌న తెచ్చుకోవ‌డం అవ‌స‌రం. దాదాపుగా అంద‌రికీ వ‌చ్చే జీతంలో కొంత డ‌బ్బు టీడీఎస్ రూపంలో క‌ట్ అవుతుంది. కంపెనీ వాళ్లు ఇచ్చే ధ్రువప‌త్రం వ‌ల్ల ఇన్ క‌మ్ టాక్స్ క‌ట్టేటప్పుడు మిన‌హాయింపు ఉంటుంది. ప‌న్ను ప్ర‌ణాళిక‌ల గురించి అవ‌గాహ‌న లేకుంటే ఆర్థిక స‌ల‌హాదారుడిని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. దీనితోపాటు ప‌న్ను మిన‌హాయింపు క‌లిగించే పీపీఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుబ‌డి పెడితే మంచి ఫ‌లితాలుంటాయి.

4. ప‌రిమితికి మించి అప్పు చేయ‌డం :
సంపాదించ‌డం స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి మీరు అధికారికంగా అప్పు తీసుకోవ‌డానికి అర్హుల‌వుతారు. కొన్ని క్రెడిట్ కార్డుకంపెనీలు రుణాలు తీసుకునేందుకు మీకు ఆఫ‌ర్లు ఇస్తాయి. అలా అని వాటిని ఇష్టానుసారంగా తీసుకుంటే న‌ష్ట‌పోతారు. క్రెడిట్ కార్డు బ‌కాయిలు నెల‌కు 30 శాతం కంటే ఎక్కువ‌గా ఉండ‌కుండా చూసుకోవాల‌ని చ‌క్ర‌వ‌ర్తి పేర్కొన్నారు. తిరిగి చెల్లించ‌లేని స్థాయిలో రుణం తీసుకోకుండా.. ఉన్నంతలో ఖ‌ర్చు పెట్టుకుంటే బెట‌ర్‌ అని సూచించారు.

5. భ‌విష్య‌త్తు కోసం ప్లాన్ చేసుకోక‌పోవ‌డం :
Financial plan for future : త‌మ సొంత సంపాద‌న‌ను ఆస్వాదించాల‌ని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్త‌వం ఏంటంటే.. ఉద్యోగ జీవిత ప్రారంభంలోనే పొదుపు చేయ‌డం, పెట్టుబ‌డి పెట్ట‌డం స్టార్ట్ చేయాలి. అప్పుడే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన ఆర్థ‌ిక జీవితంతో పాటు అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుత జీవన విధానంలో రాజీ ప‌డ‌కుండా ప్లాన్ చేసుకుంటే సత్ఫ‌లితాలు ఉంటాయి. సేవింగ్స్, ఎమ‌ర్జెన్సీ ఫండ్‌, రిటైర్​మెంట్ కోసం ప్లాన్ చేసుకోవ‌డం లాంటి ల‌క్ష్యాలు ఉద్యోగ ప్రారంభంలోనే పెట్టుకుని వాటిని నెర‌వేర్చుకునేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకోవాలి.

ఒక‌వైపు మీకు ఇష్ట‌మైన జీవితం గ‌డుపుతూనే.. మ‌రోవైపు దీర్ఘ‌కాలిక ఆర్థిక ప్ర‌ణాళిక‌లు క‌లిగి ఉండ‌టం చాలా అవ‌స‌రం. దీని కోసం ముందుగానే స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌లు, ల‌క్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయండి.

ABOUT THE AUTHOR

...view details