పండగ అంటే ఆనందం.. దీపావళి వేళ ఇది రెట్టింపు అవుతుంది. ఈ ఆనంద సమయంలో కాస్త ఆర్థిక విషయాలనూ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో కీలకమైనవేమిటో చూద్దాం..
రక్షణకే ప్రాధాన్యం..
ఇతర పండగలకు భిన్నంగా దీపావళికి రక్షణ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దివ్వెలు, బాణాసంచా ఇలా ఎన్నో విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. దీన్ని మనం జీవితానికీ అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తీ ఆర్థికంగా రక్షణ కల్పించుకోవాలి. మన చుట్టూ ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు కనిపిస్తుంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా లేకపోతే.. పెట్టుబడులను నష్టపోయే ఆస్కారం ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం ఎప్పుడూ మేలు. వీలైనంత వరకూ దీర్ఘకాలిక పెట్టుబడులే మనకు రక్ష. పెట్టుబడి పథకం ఏదైనా సరే.. పూర్తిగా అవగాహన పెంచుకున్నాకే మదుపు చేయాలి. పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. అదే విధంగా ఆర్థిక ప్రణాళికల విషయంలో వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు స్వీకరించడంలో తప్పులేదు. తగిన మొత్తానికి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలతో కుటుంబానికి రక్షణ కల్పించడం మర్చిపోవద్దు. ఇప్పటికీ బీమా పాలసీలు లేకపోతే.. ఈ పండగ వేళ మీరు చేయాల్సిన మొదటి పని.. పాలసీలను తీసుకోవడమే.
ముందస్తు వ్యూహంతో..
కొత్త దుస్తులు, వస్తువులు ఏం కొనాలి అని చాలా రోజుల ముందునుంచే ప్రణాళికలు వేసుకొని ఉంటారు. ఇదే వ్యూహాన్ని పెట్టుబడుల్లోనూ పాటించాలి. పొదుపు, మదుపులను ఎంత ముందుగా ప్రారంభిస్తే ఫలితాలు అంత బాగుంటాయి. చక్రవడ్డీని పొందుతూ ప్రభావంతో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి ప్రణాళికతో సిద్ధం కావాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించడం తేలిక అవుతుంది. చివరి నిమిషంలో హడావుడి వల్ల పండగ ఆనందం కోల్పోతాం. పథకాలను ఎంపిక చేసుకునేటప్పుడు తొందరపడితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
వైవిధ్యం పాటిస్తూ..
బాణాసంచా, మిఠాయిలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాం కదా. ఇదే విధంగా పెట్టుబడుల్లోనూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. వివిధ పథకాల్లో ఉండే మంచి చెడులను అంచనా వేయాలి. పోర్ట్‌ఫోలియో సమతౌల్యంగా ఉన్నప్పుడే రాబడి అనుకున్నట్లుగా ఉంటుంది. బాణాసంచాలో కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. మరికొన్ని సురక్షితమైనవి. అన్నీ కలిసి ఉన్నప్పుడే సంతోషం కలుగుతుంది. పెట్టుబడుల్లోనూ కొన్ని అధిక నష్టభయం ఉన్నవి ఉంటాయి. మరికొన్ని సురక్షితంగా ఉంటాయి. వీటన్నింటిలో కలిపి వైవిధ్యంగా మదుపు చేసినప్పుడే అవి మనకు రాబడి అనే ఆనందాన్ని పంచుతాయి.