Festive Shopping Tips : మన భారతీయులం పండుగలను చాలా వైభవంగా జరుపుకుంటాం. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తాం. ఇళ్లను బాగా అలంకరించుకోవడం దగ్గర నుంచి మిత్రులకు, బంధువులకు బహుమతులు ఇవ్వడం వరకు చాలానే చేస్తాం. ఇది ఒక పరిమితి వరకు ఉంటే మంచిదే.. లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పండుగల వేళ.. ఒక ప్రణాళికతో కొనుగోళ్లు ఎలా చేయాలి? మన ఖర్చులను ఏ విధంగా అదుపు చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ వేసుకోవాలి!
How To Make Good Budget Plan :మీ ఆర్థిక పరిస్థితిని అనుసరించి బడ్జెట్ వేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి మించి కొనుగోళ్లు చేయకుండా చూసుకోవాలి. దీనివల్ల అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. ఫలితంగా మీపై ఎలాంటి అనవసర ఆర్థిక ఒత్తిడి పడకుండా ఉంటుంది.
ధరలు పోల్చిచూడండి!
ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు చాలా చౌకగా దొరికేవి. నేరుగా వెళ్లి కొంటే కాస్త ఎక్కువ ధరే ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో కన్నా, రిటైల్ దుకాణాల్లోనే తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయి. కనుక ఒక వస్తువును కొనుగోలు చేసేముందు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ధరలను పోల్చి చూడండి. ముఖ్యంగా గృహోపకరణాల విషయంలో ఏ విధంగానూ రాజీ పడకండి. రిటైల్ స్టోర్లను సందర్శించిన తరువాతే ఓ నిర్ణయం తీసుకోండి.
క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉపయోగించుకోండి!
How To Claim Credit Card Reward Points : పండగల వేళలో మీ క్రెడిట్ కార్డులు అందిస్తున్న పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డులు గురించి తెలుసుకోండి. వీటి ద్వారా తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేయడానికి వీలవుతుంది.
నో-కాస్ట్ ఈఎంఐ
What Is No Cost EMI : నేడు అనేక క్రెడిట్ కార్డు సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలు నో-కాస్ట్-ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అధిక విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ నో-కాస్ట్-ఈఎంఐ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ప్రత్యేకంగా వ్యక్తిగత రుణాలు లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
బడ్జెట్లోనే బహుమతులు!
మీరు ఎవరికైనా బహుమతులు ఇవ్వాలని అనుకుంటే.. కచ్చితంగా బడ్జెట్లో ఉండేలా చూసుకోవాలి. లేదా మీరే స్వయంగా సదరు బహుమతులు తయారుచేసుకోవాలి. వాస్తవానికి మీ చేతితో తయారు చేసిన వస్తువులు, దుకాణంలో కొన్న వాటికంటే ఎంతో విలువైనవని మర్చిపోకండి. మీకు కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలాంటివి ప్రయత్నించవచ్చు.