తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ ఆర్థిక మాంద్యం భయాలు.. ఈ జాగ్రత్తలతో ధీమాగా..! - భారత్​ ఆర్థిక సంక్షోభం

ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు మళ్లీ ఈ పదం తరచూ వినిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోని పలు దశల్లో ఇదీ ఒక భాగమే. అయినప్పటికీ.. ఇది  ఒక ప్రమాదకరమైన హెచ్చరిక. నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆర్జన శక్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం లాంటివి ఈ సమయంలో చూస్తుంటాం. కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలూ తగ్గిపోవడం లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థల సంగతి ఎలా ఉన్నా.. కుటుంబపరంగా మనం ఈ మాంద్యం చేతికి చిక్కకుండా కాపాడుకోవాలి. ఇందుకోసం అనుసరించాల్సిన మార్గాలేమిటో చూద్దాం.

Fears of economic recession.. are these precautions followed?
Fears of economic recession.. are these precautions followed?

By

Published : Sep 17, 2022, 11:05 AM IST

ప్రతి కుటుంబం తాము ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటుంది. ఈ కోరిక వాస్తవంలోకి రావాలంటే ఏం చేస్తున్నారన్నదే కీలకం. అనుకున్న లక్ష్యాలన్నీ సాధించినప్పుడే జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. జీవితంలోని అన్ని దశల్లోనూ ఇబ్బంది లేని ఆర్థిక ప్రయాణం సాధ్యమవుతుంది. ఆర్థిక మాంద్యంలాంటివి సంభవించినప్పుడు అనుకున్న లక్ష్యాల సాధన ఆలస్యం కావచ్చు. మాంద్యం పరిస్థితులు తప్పించుకోలేం. కానీ, మన కుటుంబంపై దాని ప్రతికూల ప్రభావం పడకుండా నియంత్రించుకునే వీలుంది.

మూడో వంతు పొదుపు..
కొన్ని రోజులపాటు.. ఖర్చులను నియంత్రించడం అనేది అలవాటు చేసుకోవాలి. మీ జీతంలో తప్పనిసరిగా మూడోవంతు పొదుపు, పెట్టుబడుల వైపు మళ్లించండి. మిగిలిన సొమ్మునే ఖర్చు చేయండి. ఇది సవాలే. కానీ, ఒకసారి మీ వ్యయాలన్నీ క్రమ పద్ధతిలో రాసుకొని, దేనికి అధికంగా డబ్బు వెచ్చిస్తున్నారో చూసుకోండి. దీనివల్ల వృథా తగ్గించుకునే అవకాశం దొరుకుతుంది. మీ ఆదాయం పెరిగినప్పుడు.. ఆ మేరకు పొదుపు పెంచుకోవాలి. కానీ, ఖర్చులు కాదు. అప్పుడే సంపద సృష్టి జరుగుతుంది.

వైవిధ్యంగా..
ఆర్థిక స్థిరత్వం సాధించే క్రమంలో పెట్టుబడులు తప్పనిసరి. వీలైనంత తొందరగా ప్రారంభించడం, దీర్ఘకాలం కొనసాగినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని మర్చిపోవద్దు. ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి 70-80 శాతం వరకూ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. 20-30 శాతం వరకూ డెట్‌ పథకాలు, బంగారం తదితర మార్గాల్లో మదుపు చేయొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ నిష్పత్తి మారుతూ ఉంటుంది. 60 ఏళ్లు వచ్చే నాటికి ఈక్విటీ పెట్టుబడులు 30-60 శాతం వరకూ ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లను ఎంచుకోవడంతోపాటు, డెట్‌ ఆధారిత పథకాలు, బ్యాంకు, పోస్టల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకోవాలి. మొత్తం పెట్టుబడిలో బంగారానికి 10 శాతాన్ని మించి కేటాయించకూడదు. సార్వభౌమ పసిడి బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయెచ్చు.

ధీమాగా ఉండేలా..
ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునేలా కుటుంబానికి ఆర్థిక ధీమానివ్వాలి. ఇది బీమాతోనే సాధ్యం అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్జించే వ్యక్తి తన పేరుమీద వార్షికాదాయానికి కనీసం 20 రెట్ల వరకూ బీమా తీసుకోవాలి. అంటే ఏడాదికి రూ.5లక్షలు ఆర్జించే వ్యక్తి కనీసం రూ.కోటి బీమా తీసుకోవాలి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా తప్పనిసరి. బృంద బీమా ఉన్నా.. సొంతంగా పాలసీ ఉంటే మంచిది. కనీసం సూపర్‌ టాపప్‌ పాలసీనైనా తీసుకోవాలి.
ఆర్థిక ప్రణాళిక అనుకోవడం ఎంతో సులభం. కానీ, దాన్ని ఆచరించాలంటే ఎంతో క్రమశిక్షణ అవసరం. ఖర్చులు నియంత్రించాలి, పెట్టుబడులు పెట్టాలి అనే కోరిక బలంగా ఉండాలి. క్రెడిట్‌ స్కోరూనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. చిన్న పొరపాట్లు భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తాయని మర్చిపోవద్దు.

అత్యవసర నిధితో..
అనుకోని పరిస్థితులు తలెత్తి, ఆదాయం ఆగిపోయినా.. తగ్గినా.. మన దగ్గరున్న అత్యవసర నిధి ఆదుకునేలా ఉండాలి. మీ పొదుపు మొత్తంలో నాలుగో వంతును అత్యవసర నిధి కోసం కేటాయించండి. అంటే.. మీరు రూ.100 పొదుపు చేస్తే.. అందులో రూ.25 అత్యవసర నిధి కోసం ఉండాలి. మిగతా రూ.75తో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 12 నెలల ఖర్చులకు సరిపడా మొత్తం అత్యవసర నిధిగా ఉండాలి. వాడుకున్నా.. సాధ్యమైనంత వెంటనే దాన్ని భర్తీ చేసేలా చూసుకోవాలి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ఇవీ చూడండి:వడ్డీ భారం తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్​ పాటించండి!

ఉబర్​కు హ్యాకింగ్​ బెడద.. కస్టమర్ల సమాచారం అతడి చేతుల్లో..!

ABOUT THE AUTHOR

...view details