FDI inflow India: ఇది వరకెన్నడూ లేనంతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మన దేశం ఆకర్షించగలిగింది. 2021-22లో ఏకంగా 83.57 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తెలిపింది. సంస్కరణలతో పాటు సులభతర వాణిజ్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. 2020-21లో ఇవి 81.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
FDI in India 2022: 'కొవిడ్, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల చోటుచేసుకున్న సవాళ్ల నేపథ్యంలోనూ విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. 2003-04తో పోలిస్తే ఈ పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయ’ని పేర్కొంది. 'తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ వేగంగా మారుతోంద'ని వివరించింది. 2020-21తో పోలిస్తే తయారీ రంగంలోకి ఎఫ్‌డీఐ 76 శాతం పెరిగింది. 'బొగ్గు వెలికితీత, కాంట్రాక్ట్ తయారీ, డిజిటల్ మీడియా, ఏక బ్రాండ్ రిటైల్, పౌర విమానయానం, రక్షణ, బీమా, టెలికాం రంగాల్లో సంస్కరణలు చేపట్టడమూ కలిసివచ్చింది' అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అగ్రగామి దేశాలు:మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలో 27 శాతం వాటాతో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా(18%), మారిషస్(16%)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.