Toll Gate Gps Navigation System: దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న టోల్ పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశాబ్దాల కాలంగా ఉన్న టోల్‌ప్లాజాల వ్యవస్థకు మంగళం పలికేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో జీపీఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు గత ఏడాది నిర్ణయం తీసుకున్న కేంద్రం.. కొత్త పాలసీని సాధ్యమైనంత త్వరగా అమలుచేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు జాతీయ రహదారులపై నిర్ణీత దూరం పరిధిలో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి.. రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు వాహనదారుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ వస్తోంది.
అయితే ఇటీవల కాలంలో టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అన్ని టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పూర్తిగా తగ్గి వాహనదారుల ప్రయాణం సులువుగా మారింది. ఇప్పుడు జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులువుగా మార్చేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ టోల్‌ప్లాజాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది. శాటిలైట్ ఆధారిత జీపీఎస్ ట్రాకింగ్ విధానం అమలుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. 1.37 లక్షల కార్లపై ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
కార్ల గమనం ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది?
ప్రస్తుతం మన రోడ్లపై ప్రయాణించే 97 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. కాబట్టి, ఖాతా నుంచి సేకరణ వంటి మౌలిక సదుపాయాలు దాదాపు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు కావలసిందల్లా ఈ కార్లు ఎప్పుడు, ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడమే. అందుకు జీపీఎస్ వ్యవస్థను ఉపయోగిస్తారు. జీపీఎస్ ట్రాకింగ్ విధానం ద్వారా టోల్ రోడ్లపై కార్లు ప్రయాణించే కిలోమీటర్లను లెక్కిస్తారు.
ఎంత వసూలు చేస్తారు?
కారు టోల్ రోడ్డు పైకి వచ్చిన వెంటనే ప్రభుత్వం టోల్ టాక్స్ వసూలునూ ప్రారంభిస్తుంది. కారు ప్రయాణించే కిలోమీటర్లపై ఛార్జీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తారు.
ప్రస్తుతం ఈ వ్యవస్థ మన దేశంలో అమల్లో ఉందా?
జీపీఎస్ నేవిగేషన్ పరికరాలతో ప్రస్తుతం 1.37 లక్షల కార్లపై ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. దానిపై రష్యా, దక్షిణ కొరియా నిపుణులు నివేదిక తయారు చేస్తున్నారు. అమలులో ఎదురైన లోటుపాట్లు, తీసుకోవాల్సిన ఇతర చర్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి కొత్త పాలసీని దేశవ్యాప్తంగా విడతల వారీగా అమలుచేయాలని భావిస్తోంది కేంద్రం. మరోవైపు, రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ వ్యవస్థ అమలు కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. త్వరలో ప్రకటించనున్నారు.