Family Floater Health Insurance Plan : ఊహించని అనారోగ్య సమస్యల వల్ల సంభవించే ఆర్ధిక కష్టాల నుంచి ఫ్యామిలీని రక్షించుకోవాలంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ అనివార్యంగా మారింది. దాంతో చాలా మంది ఆరోగ్య బీమా తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో.. ఎలాంటి పాలసీ తీసుకుంటే పుట్టిన పిల్లల నుంచి ఫ్యామిలీ మొత్తానికి ఆరోగ్య బీమా లభిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Family Floater Health Insurance Plan : సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు.. ప్రసూతి ప్రయోజనాలు కలిగి ఉండే ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కవరేజ్ అందిస్తుంటాయి. పాలసీదారులు దీనికోసం ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ.. 90వ రోజు తర్వాత రక్షణ కొనసాగుతుందని నిర్ధారించుకోవడానికి.. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ(Family Floater Health Insurance)లో చేర్చాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వారు 25 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పెళ్లి చేసుకున్న తర్వాత.. వారు ప్రత్యేక, స్వతంత్ర ఆరోగ్య బీమా ప్లాన్ పొందడానికి మరో కొత్త పాలసీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి.. కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే తక్కువ ఖర్చుతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్(Family Floater Plan)ను కొనుగోలు చేయడం ఉత్తమమైనదిగా నిపుణులు సూచిస్తున్నారు.
Family Floater Policy Benefits :ప్రస్తుతం దేశంలో కుటుంబ ఆరోగ్య రక్షణ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన ఆఫర్లలో ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్ ఒకటి. చాలా దేశాల్లో ఈ ప్లాన్ అస్సలు కనిపించదు. కుటుంబం పట్ల మన దేశ సంస్కృతిని కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సూచిస్తుంది. తల్లిదండ్రులతోపాటు తాతలను కూడా చేర్చేందుకు కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే.. యుక్త వయస్సులో తల్లిదండ్రులైన వారు ముందుగా రూ.10 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఉత్తమం. అలాగే కంపెనీలు పాలసీ ప్రీమియం నిర్ణయించే సమయంలో మొత్తం కుటుంబసభ్యుల వయస్సును పరిగణనలోకి తీసుకుంటాయి. అందులో పెద్ద సభ్యుని వయస్సు ప్రీమియం రేట్లను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా మారుతుంది.