ఆర్థిక స్వేచ్ఛకు పునాది పొదుపు. తమ కలలను సాకారం చేసుకునేందుకు అన్ని వేళలా ఇది సరిపోకపోవచ్చు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి.. అత్యవసరంగా కొంత డబ్బు కావాలి.. సందర్భం ఏదైనా సరే.. కొన్నిసార్లు అప్పు తీసుకోవడం అనివార్యం కావచ్చు. మార్కెట్లో ఎన్నో రకాల రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆస్తి తనఖా రుణాలు ఒకటి. హామీ లేని రుణాలతో పోలిస్తే వీటిలో కొన్ని సానుకూలతలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ తరహా రుణాలు తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేమిటో తెలుసుకుందాం.
ఇప్పటి వరకూ రుణాలు తీసుకోని వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఆస్తి తనఖా రుణాలు (లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ- ఎల్‌పీఏ) సులభంగా తీసుకునేందుకు వీలవుతుంది. ఎలాంటి హామీ లేని వ్యక్తిగత, ఇతర రుణాలతో పోలిస్తే.. అధిక మొత్తం లభించడంతోపాటు, వడ్డీ రేటూ కొంత తక్కువగా ఉంటుంది. 15-25 ఏళ్ల దీర్ఘకాలం వరకూ వ్యవధి ఉంటుంది. మోసపూరిత కార్యకలాపాలకు మినహా ఎలాంటి లావాదేవీలకైనా ఈ మొత్తాన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
సొంతిల్లు, వాణిజ్య స్థలం తాకట్టు పెట్టి, వ్యాపార అవసరాల కోసం రుణాలను తీసుకునేందుకు వీలుంటుంది. అదే సమయంలో రుణ గ్రహీత తన ఆస్తిని తాను ఉపయోగించుకుంటూనే ఉంటారు. గృహ, వాణిజ్య రకం, ఆస్తిపై ఉన్న హక్కు ఆధారంగా రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇళ్లకు సాధారణంగా అధిక విలువ (లోన్ టు ప్రాపర్టీ వాల్యూ) ఉంటుంది.
ఎలా తీసుకోవాలి?
తనఖా పెట్టాలనుకుంటున్న ఆస్తికి సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ తర్వాతే మీరు రుణానికి దరఖాస్తు చేయడం మేలు. ప్రస్తుతం బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు ఈ రుణాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసేందుకు వీలుంది. వచ్చిన దరఖాస్తులను రుణదాత సమగ్రంగా పరిశీలిస్తారు. రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతోపాటు, తిరిగి చెల్లించే సామర్థ్యం, ఆస్తి విలువ, వయసు, వృత్తి, ఆస్తి ఉన్న ప్రాంతం, పాతదా/కొత్తదా లాంటి వివరాలు చూస్తారు. ఆ ఆస్తి ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది, యాజమాన్య పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అనేదీ కీలకమే. ఆ తర్వాత ఆస్తి విలువను లెక్కిస్తారు. మార్కెట్ విలువతో పోలిస్తే ఆర్థిక సంస్థల లెక్కల్లో వ్యత్యాసం ఉంటుంది.