Export Duty On Rice: దేశంలో ఆహారధాన్యాల నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోధుమ, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన సర్కార్ తాజాగా బియ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చింది. ఉప్పుడు బియ్యం తప్ప.. అన్ని బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం మేర ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా సరఫరాలను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా నూకల ఎగుమతులపై పూర్తి నిషేధం విధిస్తూ శుక్రవారం మరో ప్రకటన చేసింది. అయితే, ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న వాటికి మాత్రం ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించింది. సెప్టెంబరు 15 వరకు ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరిన నిల్వల ఎగుమతులను కూడా ఆంక్షల పరిధి నుంచి తప్పించింది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో గోధుమలు, బియ్యం నిల్వలు తగ్గాయని వార్తలు వచ్చాయి. గోధుమ నిల్వలు 14 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు ఇటీవల ఓ ఉన్నతాధికారి తెలిపారు. బియ్యం నిల్వలు సైతం పడిపోయినప్పటికీ.. ఇంకా కేంద్రం విధించిన పరిమితి కంటే రెండింతలు అధికంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకం 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన'ను సెప్టెంబరు 30 తర్వాత కొనసాగించాలా.. లేదా.. అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.