తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎక్స్ఛేంజీకి రాణి.. అదృశ్య గురువు... ఓ 'రహస్య' కథ! - చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈ

Chitra Ramkrishna Himalayan Yogi: ఎన్ఎస్​ఈకి తొలి మహిళా అధిపతి... 'ఎక్స్ఛేంజీకి రాణి' అంటూ ప్రశంసలు... ఆ సంస్థను ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా మార్చిన ఘనత... అయితే, ఆమె కథ అక్కడితో ఆగిపోలేదు. ఓ అదృశ్య యోగి చేతిలో కీలుబొమ్మగా మారారు. రహస్య సమాచారాన్ని ఆయనతో పంచుకున్నారు. ఎన్ఎస్​ఈ వ్యవస్థాపక సభ్యురాలైన చిత్రా రామకృష్ణ కథే ఇది..

chitra ramakrishna
chitra ramakrishna

By

Published : Mar 27, 2022, 8:01 AM IST

Chitra Ramkrishna Yogi:చిత్రా రామకృష్ణ.. ఇటీవలి కాలంలో దేశమంతా మారుమోగుతున్న పేరు ఇది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వ్యవస్థాపక సభ్యురాలైన ఆమె.. తొలి మహిళా అధిపతిగా కూడా వ్యవహరించారు. ఆ ఎక్స్ఛేంజీని ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజీగా మార్చిన ఘనతా ఆమె సొంతం. 2016లో పదవీ విరమణ చేసినపుడు ఆమె సేవలకు మంచి ప్రశంసలే దక్కాయి. అక్కడితో కథ ముగిసి పోయి ఉంటే ఎంతో బాగుండేది.

'ఎక్స్ఛేంజీకి రాణి' అని అందరూ ప్రశంసలు అందుకున్న చిత్రా రామకృష్ణకు గత నెలలో ఊహించని పరాభవం ఎదురైంది. ఎక్స్ఛేంజీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో ఉండే ఒక యోగితో ఏళ్ల కొద్దీ ఆమె పంచుకుంటున్నారంటూ, సెబీ 190 పేజీల ఆదేశాలను ఫిబ్రవరిలో విడుదల చేయడంతో దేశమంతా కనుబొమలు ఎగరేసింది. ఆరోపణలు ఆమెకే పరిమితమైనా.. ప్రభావం మాత్రం ఎక్స్ఛేంజీ త్వరలో తీసుకురానున్న ఐపీఓపై పడనుంది. పబ్లిక్‌ ఇష్యూ మరింత ఆలస్యం కావొచ్చు. అంతే కాదు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌లో ఎదుగుతున్న ఎన్‌ఎస్‌ఈ వృద్ధికి విఘాతం కలగొచ్చు. ఇటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉంటే భారత్‌లో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వస్తారని ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఒకరు ప్రశ్నించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మిస్టరీ వీడేనా..?:తాను ఎటువంటి తప్పూ చేయలేదనే ఇప్పటిదాకా రామకృష్ణ కోర్టులకు చెబుతూ వస్తున్నారు. యోగితో పంచుకున్న విషయాలను పరిశ్రమలో మెంటార్లు, ఇతర సీనియర్లతో పంచుకున్నట్లే భావించాలని అంటున్నారు. యోగికి ఎటువంటి రూపం లేదని చెబుతున్నప్పటికీ.. ఒక ఇమెయిల్‌ అడ్రెస్‌ ద్వారా సమాచార మార్పిడి జరగడం విశేషం. అందులో ఆయన్ను 'స్వామీ జీ'గా ఆమె సంబోధించారు. రామకృష్ణను ఆ యోగి ఒక 'తోలుబొమ్మ'(పప్పెట్‌)గా చేసి ఆడించారని సెబీ ఆరోపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో సిబ్బంది ప్రమోషన్లనూ తన కనుసన్నల్లో జరిగేలా చూసుకున్నారని అంటోంది. ఉదాహరణకు క్యాపిటల్‌ మార్కెట్లలో ఎటువంటి అనుభవం లేని సుబ్రమణియన్‌ను 2013లో ఎన్‌ఎస్‌ఈలోకి తీసుకోవడం ఆ తర్వాత యోగి సలహాతో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరు(సీఓఓ)గా ప్రమోషను ఇవ్వడం అందులో భాగమే. అయితే అన్నిటికీ కారణమైన 'యోగి' ఎవరని గుర్తించడమే కీలకంగా మారింది. తెర వెనక ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ మిస్టరీ వీడాలి. ఎందుకంటే సుబ్రమణియన్‌యే ఆ గురు అని నిరూపించే ఆధారాలేవీ ఇంకా లభించలేదు.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా:ముంబయి బ్రోకర్లు, బ్యాంకర్ల మధ్య అవినీతి కారణంగా బీఎస్‌ఈ మసకబారిన క్షణాన ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటుకు నాంది పడిందని చెప్పాలి. 1991లో హర్షద్‌ మెహతా ఏకంగా 2 బిలియన్‌ డాలర్ల వరకు బ్యాంకుల నుంచి మార్కెట్లోకి మళ్లించి కుంభకోణానికి తెరదీశారు. అది వెలుగులోకి రావడంతో భారత మార్కెట్లు కుప్పకూలాయి. విచారణ పూర్తి కాకముందే మెహతా మరణించారు. 1990ల్లో ఒక ఆధునిక ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేసే క్రమంలో నియమితులైన వారిలో ఐడీబీఐలో ఒక యువ ఉద్యోగినిగా ఉన్న రామకృష్ణ కూడా ఒకరు. ఆ సమయంలోనే మరో నలుగురితో కలిసి ఎన్‌ఎస్‌ఈని సృష్టించేందుకు ఎంపికయ్యారు. 1994లో వీరు ఒక శాటిలైట్‌ను వినియోగించి స్క్రీన్‌ ఆధారిత ట్రేడింగ్‌ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ధరలను తెలుసుకునేందుకు ఇది వీలు కల్పించింది. అలా ఆమె వృత్తిజీవితంలో అంచెలంచెలుగా ఎదిగి 2013లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయ్యారు.

వారిద్దరికీ ప్రత్యేక ఎలివేటర్‌:ఒక లీజింగ్‌, మరమ్మతు సేవల కంపెనీలో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి వ్యక్తి అయిన సుబ్రమణియన్‌ను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన తొలి రోజే చిత్రా రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈలోకి తీసుకొచ్చారు. మూడేళ్ల అనంతరం ఆయన వేతనాన్ని మూడింతలు చేశారు. వీరిద్దరికి మాత్రమే ఎన్‌ఎస్‌ఈలో ఒక ఎలివేటర్‌ ఉండేది. ఇద్దరు పాత్రికేయులు రాసిన 'అబ్సల్యూట్‌ పవర్‌' పుస్తకం ప్రకారం.. ఆమె చాలా వరకు నిర్ణయాలను జ్యోతిష్యం ఆధారంగా తీసుకునేవారట. ఇక కొంత మంది బ్రోకర్లకు అదే బిల్డింగ్‌లో సర్వర్లను పెట్టుకోవడానికి వీరిద్దరూ అనుమతులు ఇచ్చారని సెబీ అనుమానం వ్యక్తం చేసింది. తద్వారా ట్రేడింగ్‌ వ్యవస్థలో వేగవంతమైన యాక్సెస్‌ వీరి సొంతమైంది.

లిమాయే ఆధ్వర్యంలో గాడిలోకి.. కానీ:2016లో రామకృష్ణ పదవీ విరమణ చేశాక.. వాల్‌స్ట్రీట్‌ దిగ్గజం లిమాయే బాధ్యతలు చేపట్టారు. వాటాదార్లతో సంబంధాలను మెరుగుపరచుకుని.. బ్రోకర్ల డిఫాల్ల్‌ను తగ్గించేలా కొత్త విధానాలను తీసుకువచ్చారు. బలమైన ఫలితాలను సైతం ఎన్‌ఎస్‌ఈ నమోదు చేయగలిగింది. అయితే తాజా పరిణామాలు ఈ ప్రగతిని పట్టాలు తప్పించే అవకాశం ఉందని కొంత మంది బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎక్స్ఛేంజీలో నుంచి పలువురు విదేశీ పెట్టుబడుదార్లు బయటకు వెళ్లారు. గతంలో జరిగిన తప్పులకు ఎన్‌ఎస్‌ఈ ఇపుడు ఫలితం అనుభవిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

'చిత్రా.. నీ కురులు సూపర్'.. బాబాజీ ఇ-మెయిళ్లు లీక్!

స్టాక్​ మార్కెట్​కు సారథి.. కానీ 'అదృశ్య' యోగి చేతిలో కీలుబొమ్మ.. ఇది ఓ 'చిత్ర' కథ!

ABOUT THE AUTHOR

...view details