కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నెలకు పింఛను హామీనిచ్చే ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పథకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. 'PMVVY' అనేది 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పెన్షన్ పథకం. కనీస, గరిష్ఠ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించి ప్లాన్‌ని కొనుగోలు చేసిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం తక్షణమే అమల్లోకి వస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక ప్రాతిపదికన పెన్షన్‌ను అందిస్తారు. సాధారణ పెన్షన్ కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే చేతిలో గణనీయమైన మొత్తం ఉండాలి.
అర్హత:
దేశంలోని 60 ఏళ్లు పూర్తి అయినవారు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు 'PMVVY' పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ పథకానికి కొనుగోలు చేయడానికి గరిష్ఠ వయోపరిమితి లేదు. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితిలో మెడికల్ ఎమర్జెన్సీ (స్వీయ, జీవిత భాగస్వామి) విషయంలో పాలసీదారులు కొనుగోలు ధరలో 98% ఉపసంహరించుకోవచ్చు.
పాలసీకి కావలసిన పత్రాలు:
ఆధార్ కార్డు, పాన్ కార్డు, వయసు రుజువు, చిరునామా, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ముఖ్యంగా కావాలి. ఏదైనా ఎల్ఐసీ బ్రాంచికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం ఎల్ఐసీ బ్రాంచి వద్ద లభిస్తుంది. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పెన్షన్ తీసుకోవడానికి కాలవ్యవధి:
'PMVVY' కింద మొదటి విడత పెన్షన్.. పథకం కొనుగోలు తేదీ నుంచి 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు, 1 నెల (ఫించనుదారుడు ఎంచుకున్న విధంగా) తర్వాత ప్రారంభమవుతుంది. ఉదా: మీరు నెలవారీ పెన్షన్ చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటే.. మీరు ఇప్పడు పథకాన్ని కొనుగోలు చేస్తే 1 నెల తర్వాత మీ పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి.
మెచ్యూరిటీ ప్రయోజనాలు:
'PMVVY' పెన్షన్, మరణ, మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తుంది. ఖాతాదారు ఎంచుకున్న పెన్షన్ విధానంపై ఆధారపడి 'PMVVY' 10 సంవత్సరాల పాలసీ కాలానికి పెన్షన్‌ని అందిస్తుంది. 10 సంవత్సరాల పాలసీ వ్యవధిలో ఫించనుదారుడు మరణిస్తే పాలసీ కొనుగోలు ధర లబ్ధిదారునికి తిరిగి ఇచ్చేస్తారు. ఖాతాదారుడు 10 సంవత్సరాల పాలసీ కాలానికి జీవించి ఉంటే, చివరి వాయిదాతో పాటు కొనుగోలు ధర తిరిగి ఇచ్చేస్తారు.