Ethos IPO: లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్ సంస్థ ఎథోస్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 18న ప్రారంభమై 20న ముగియనుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.836- 878ను సంస్థ నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ.375 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో 11,08,037 వరకు ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో యశోవర్థన్ సాబు, కేడీడీఎల్, మహేన్ డిస్ట్రిబ్యూషన్, సాబు వెంచర్ ఎల్‌ఎల్‌పీ, అనురాధ సాబు, జై వర్థన్ సాబు, వీబీఎల్ ఇన్నోవేషన్స్, అనిల్ ఖన్నా, నాగరాజన్ సుబ్రమణియన్, సి.రాజశేఖర్, కరణ్ సింగ్ భండారీ, హర్షవర్థన్ భువాల్క, ఆనంద్‌వర్థన్ భువాల్క, షాలినీ భువాల్క, మంజు భువాల్కలు షేర్లు విక్రయించనున్నారు. ధరల శ్రేణిలో గరిష్ఠం వద్ద కంపెనీ రూ.472.3 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపు, మూలధన అవసరాలు, కొత్త స్టోర్ల ఏర్పాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
- వీనస్ పైప్స్ ఐపీఓ తొలి రోజున 2.37 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 35,51,914 షేర్లను ఆఫర్ చేయగా.. 84,13,860 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- రిటైల్ విభాగంలో 4.10 రెట్లు, క్యూఐబీ విభాగంలో 36 శాతం, సంస్థాగత మదుపర్ల నుంచి 98 శాతం చొప్పున స్పందన కనిపించింది.
- డెల్హివరీ ఐపీఓ మొదటి రోజున 21 శాతం స్పందన నమోదైంది.
- ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ ఐపీఓ రెండో రోజున 57 శాతం స్పందన కనిపించింది. ఈ ఇష్యూ గురువారంతో ముగియనుంది.
- ఏషియన్ గ్రానిటో ఇండియా రూ.441 కోట్ల పబ్లిక్ ఇష్యూకు మంచి స్పందన వచ్చినట్లు సంస్థ తెలిపింది. కఠిన సమయంలోనూ మదుపర్లు, పెట్టుబడిదార్ల నుంచి అద్భుత స్పందన లభించిందని కంపెనీ పేర్కొంది.
- ఇష్యూలో భాగంగా 6.99 కోట్ల షేర్లను ఉంచగా.. 8.89 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 127 శాతం స్పందన కనిపించింది.