EPF Interest Earning :ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సాధారణంగా ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాను కలిగి ఉంటారు. దీనికి ప్రతి నెలా వారి ప్రాథమిక జీతంలో నుంచి 12% జమ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఈపీఎఫ్ పథకంలో మదుపు చేయడం ద్వారా పదవీ విరమణ తరువాత.. ఉద్యోగులకు ఒక భవిష్య నిధి (కార్పస్) ఏర్పడుతుంది. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ స్కీమ్ గురించి, దాని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పదవీ విరమణ తర్వాత లేదా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఎంత కాలం డబ్బును EPF ఖాతాలో ఉంచవచ్చు? ఖాతాలో నగదు జమ కాకున్నా.. అందులో ఉన్న సొమ్ముపై వడ్డీ వస్తుందా? ఉద్యోగం లేదా కంపెనీ మారిన తర్వాత అదే ఖాతాను కొనసాగించాలా? లేక కొత్తది ఓపెన్ చేయాలా? ఇలాంటి ప్రశ్నలు మీకూ ఎదురయ్యే ఉంటాయి. వీటన్నింటికీ సమాధానం ఇక్కడ ఉంది.
1. ఉద్యోగం మానేసిన తర్వాత ఎంత కాలం EPF ఖాతాలో డబ్బు ఉంచవచ్చు?
How Long Can keep money in EPF after leaving job :ఒక ఉద్యోగి జీతం నుంచి నెలవారీగా ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమ అవుతున్నంత కాలం అది యాక్టివ్‌గా ఉంటుంది. ఒక వేళ మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి, రెండు నెలల్లోపు మరో ఉద్యోగంలో చేరని పక్షంలో ఈపీఎఫ్ ఖాతాను మూసేయవచ్చు. లేదంటే పదవీ విరమణ చేసిన తరువాత ఈపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేయవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈపీఎఫ్ ఖాతాలోని 100% నగదును ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2017 జులై 24న కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఓ పత్రికా ప్రకటన చేసింది. దీని ప్రకారం 2016 నవంబర్ 11 నోటిఫికేషన్ ద్వారా ఏయే ఈఫీఎఫ్ ఖాతాలు ఇన్అపరేటివ్ అవుతాయో స్పష్టం చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఒక వ్యక్తి వయస్సు 58 సంవత్సరాలు దాటిన తరువాత ఆటోమేటిక్‌గా అతని ఈపీఎఫ్ ఖాతాను నిలిపివేస్తారు. అంట్ ఇన్ఆపరేటివ్ అయిపోతుంది. అలాగే ఒక ఉద్యోగి 55 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయితే, అతని ఈపీఎఫ్ అకౌంట్ మరో 36 నెలలపాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తరువాత ఆటోమేటిక్‌గా అది కూడా ఇన్ఆపరేటివ్ అయిపోతుంది.
ఒక వ్యక్తి పదవీ విరమణ వయస్సు కంటే ముందే ఉద్యోగం చేయడం మానేస్తే.. EPF ఖాతా చందాలు ఆగిపోయిన నెల నుంచి సరిగ్గా మూడు సంవత్సరాల పాటు అతని ఈపీఎఫ్ ఖాతా పని చేస్తుంది. ఆ తర్వాత పదవీ విరమణ వయస్సుతో సంబంధం లేకుండా ఆ ఈపీఎఫ్ ఖాతా ఇన్‌యాక్టివ్ అయిపోతుంది.