ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్రం. యాజమాన్యం మారినా.. చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్. "ఎవరు, ఏ సంస్థను కొన్నా ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. సామాజిక మాధ్యమాలన్నీ చట్టాలు, నిబంధనలను పాటించాలి. సంస్థలన్నింటికీ ఒకే నిబంధనలు ఉంటాయి" అని చెప్పారు.
మరోవైపు.. భావ ప్రకటనా స్వేచ్ఛను అనుమతిస్తానని మస్క్ చేసిన వ్యాఖ్యలపై అనేక మంది స్పందించారు. విద్వేషపూరిత ప్రసంగం, నిబంధనలు అతిక్రమించారన్న కారణంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఖాతాను బ్యాన్ చేశారు. మస్క్ ప్రకటనతో.. ఆమె ఖాతాను పునరుద్ధరించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇన్‌స్టాలో ఓ అభిమాని చేసిన పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు.
హస్తగతం.. వారిపై వేటు
అంతకుముందు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థలో కీలక పదవుల్లో ఉన్న వారిపై అనూహ్యంగా వేటు వేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్ఓ నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె సహా మరికొంత మందిని మస్క్ తొలగించారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంలో వెనక్కి తగ్గిన మస్క్‌ను కోర్టుకు లాగడంలో ఆ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే వారికి మస్క్ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అయితే వారి తొలిగింపు మస్క్‌పై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. బోర్డుతో ఆయా ఉద్యోగులు కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు మస్క్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జాక్ డోర్సే స్థానంలో ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు చేపట్టిన పరాగ్ 12 నెలల్లోగా తొలిగిస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాలని బోర్డు ఒప్పందం చేసుకున్నారు. ఆ వ్యవధి పూర్తి కాకుండానే పరాగ్‌ను మస్క్ తొలిగించడం వల్ల ఇప్పుడు సుమారు రూ. 345 కోట్లు మస్క్ చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.