ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుతో టెస్లాను పట్టించుకోరేమోనన్న భయంతో టెస్లా మదుపర్లు తమ షేర్లను అమ్మడం ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా మస్క్ ఆస్తి విలువ తగ్గింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన వ్యక్తిగత నికర విలువ 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఎలాక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లాలో మస్క్‌కు అధికమొత్తంలో షేర్లు ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన కారణంగానే టెస్లా షేర్ విలువ తగ్గి మస్క్ ఆస్తి విలువ పడిపోయిందని రాయిటర్స్ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాదిలో టెస్లా షేర్ విలువ 50 శాతం క్షీణించినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ట్విట్టర్ కోసం టెస్లా షేర్ల విక్రయం:
మస్క్ తాజాగా 4 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించారు. నవంబర్ 4-8 మధ్య 19.5 మిలియన్ల షేర్లను విక్రయించినట్లు సెక్యూరిటీ ఫైలింగ్‌లో వెల్లడైంది. ట్విట్టర్ కొనుగోలు నేపథ్యంలో గతంలోనూ టెస్లా షేర్లను విక్రయించారు మస్క్. ఆగస్టులో 7 బిలియన్ల విలువైన టెస్లా షేర్లను అమ్మేశారు. మొత్తంగా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 19 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.
మస్క్ సంపదలో మెజార్టీ వాటా టెస్లా షేర్లదే. తాజా విక్రయాల నేపథ్యంలో ఆయన సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ట్విట్టర్ డీల్‌లో మస్క్ చెల్లించాల్సిన వాటా 15.5 బిలియన్ డాలర్లని వెడ్‌బుష్ అనలిస్ట్ డాన్ ఐవ్స్ అనే సంస్థ అంచనా వేసింది. ట్విట్టర్‌లోని ఇతర ఈక్విటీ ఇన్వెస్టర్లు సంస్థను వీడితే వారి వాటాను సైతం మస్క్ కొనాల్సి ఉంటుందని, లేదా వారి స్థానంలో కొత్త ఇన్వెస్టర్లను వెతుక్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.