Elon Musk twitter invest: "ట్విట్టర్లో ఇప్పటికే నాకు 9శాతానికి పైగా షేర్లు ఉన్నాయి. మిగిలిన షేర్లన్నీ నాకు అమ్మేయండి. ఒక్కో షేరుకు 54.2 డాలర్లు చెల్లిస్తా."... సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇచ్చిన తాజా ఆఫర్ సారాంశమిది. మొత్తం షేర్ల కోసం 41.39 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లిస్తానని ప్రతిపాదన చేస్తూ బుధవారమే మస్క్ లేఖ పంపినట్లు గురువారం స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది ట్విట్టర్. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఆ సంస్థ షేర్లు 12శాతం ఎగబాకాయి.
బోర్డ్‌లో చేరేందుకు నో చెప్పి..: ట్విట్టర్లో ఇప్పటివరకు 9.2శాతం వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు మస్క్. ఆ తర్వాత ఆయన ట్విట్టర్ బోర్డులో సభ్యునిగా చేరతారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా అందుకు నిరాకరించారు మస్క్. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. "బోర్డ్‌లో చేరడం లేదని మస్క్ నాకు చెప్పారు. ఇది కూడా మంచికే అనుకుంటున్నా. బోర్డ్‌లో సభ్యునిగా ఉన్నా లేకపోయినా భాగస్వామ్యపక్షాల సలహాలు, సూచనలు మేము స్వీకరిస్తాం. మస్క్ మన అతిపెద్ద వాటాదారు కాబట్టి ఆయన ఇన్‌పుట్స్‌కు ఎప్పుడూ విలువ ఉంటుంది. కొన్ని అవాంతరాలు ఎదురైనా.. మన లక్ష్యాలు, ప్రాథమ్యాలు మారవు. నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే అధికారం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి మన పనిపైనే దృష్టిపెడదాం" అని ట్విట్టర్ ఉద్యోగులకు జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు పరాగ్.