తెలంగాణ

telangana

ETV Bharat / business

'శుక్రవారం నాటికి ట్విట్టర్​ను కొనేస్తా'.. బ్యాంకర్లకు మస్క్‌ హామీ!

Elon Musk Twitter Deal : ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధుల సమీకరణ ప్రక్రియను మస్క్‌ వేగవంతం చేశారు. ఈ మేరకు ఆయన బ్యాంకర్లతో ఇటీవల చర్చించారు.

Elon Musk Twitter Deal
Elon Musk Twitter Deal

By

Published : Oct 26, 2022, 10:39 PM IST

Elon Musk Twitter Deal : ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని శుక్రవారం (2022, అక్టోబర్‌ 28) నాటికి ముగిస్తానని టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ బ్యాంకర్లకు తెలిపారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ట్విట్టర్​ను మస్క్‌ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీంట్లో 13 బిలియన్‌ డాలర్లు బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటున్నారు. ఈ మేరకు పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అందులో భాగంగా పలు బ్యాంకర్లతో చర్చలు జరిపారు. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి తెలిపారు. బ్యాంకులు సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే మస్క్‌ ఖాతాలోకి నిధులు బదిలీ కావడమే తరువాయి అని పేర్కొన్నారు.

ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధులను అందిస్తున్న బ్యాంకుల్లో మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బార్‌క్లేస్‌, ఎంయూఎఫ్‌జీ, బీఎన్‌పీ పరిబస్‌, మిజుహో, సోషియేట్‌ జనరేల్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్లు గతంలో బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అయితే, కొనుగోలు విషయంలో మస్క్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆయా బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయని సమాచారం. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం.. ఆపై కోర్టుకు వెళ్లడం వంటి పరిణామాలతో బ్యాంకర్లు ఎటూతేల్చుకోలేని స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మస్క్‌ నుంచి స్పష్టత తీసుకున్నారు. ఆయన శుక్రవారం నాటికే డీల్‌ ముగిస్తానని చెప్పడం వల్ల నిధుల బదిలీ దాదాపు ఖాయమని తెలుస్తోంది.

మరోవైపు ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అక్టోబర్‌ 28ని తుది గడువుగా విధించింది. లేదంటే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు విధించిన గడువు ముగిసేలోగా కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసే యోచనలో మస్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details