Elon Musk as Twitter Board Of Director: ప్రముఖ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా నెట్వర్క్ 'ట్విట్టర్' బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యుడు కానున్నారు. మంగళవారం దాఖలు చేసిన రెగ్యూలెటరీ ఫిల్లింగ్ ప్రకారం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నియమితులయ్యారు. 2024 వార్షిక షేర్‌హోల్డర్స్ సమావేశం వరకు సభ్యుడిగా కొనసాగనున్నారు. మస్క్ సభ్యుడిగా ఉన్నంతకాలం.. ఒంటరిగా లేదా బృందంగానైనా ట్విట్టర్లో 14.9 శాతం కన్నా అధికంగా వాటాలు కొనుగోలు చేసేందుకు వీల్లేదు. మస్క్ సోమవారమే.. ట్విట్టర్లో 9 శాతం వాటాలను కొనుగోలు చేశారు.
మస్క్ బోర్డు సభ్యుడిగా నియమితులు కావడం పట్ల ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ స్పందించారు. మస్క్‌తో గత కొన్ని వారాలుగా మాట్లాడుతున్నామని.. ఆయన తమ బోర్డుకు గొప్ప బలం అన్నారు. "మస్క్ మంచి విమర్శకుడు. మా సంస్థ బలోపేతానికి ఇలాంటి వ్యక్తి అవసరం" అని ట్వీట్ చేశారు. ట్విట్టర్లో పరిమిత వాటాను విధించడం.. సంస్థ వ్యూహత్మక పథకంలో భాగం అన్నారు.