Elon Musk twitter: విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం 'ట్విట్టర్'ను కొనుగోలు చేశారు. తాజాగా 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఆయన.. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు.
కొనుగోలు ఒప్పందం గురించి మస్క్‌తో ట్విటర్ బోర్డు కొన్నాళ్లుగా విస్తృత చర్చలు జరుపుతోంది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్క్ గతవారం ప్రకటించారు. వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా దాన్ని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు. కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విటర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. ట్విటర్ కొనుగోలు నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్నట్లు 'ద వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది.