Elon Musk On Twitter: సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన మొత్తం ప్రపంచ సాంకేతిక రంగంలో సంచలనమే అయ్యింది. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్ల)తో కుదుర్చుకున్న ఒప్పందం, అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే, మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా నిలవనుంది. ఇంతకుముందు..
- గేమింగ్ సంస్థ యాక్టివిజన్ బిజార్డ్‌ను 68.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5.15 లక్షల కోట్ల) కు కొనుగోలు చేసే ప్రక్రియను ఈ ఏడాది జనవరిలోనే మైక్రోసాఫ్ట్ పూర్తి చేసింది. సాంకేతిక రంగంలో అతిపెద్ద కొనుగోలు లావాదేవీ ఇప్పటివరకు ఇదే.
- 2015లో నెట్‌వర్క్ స్టోరేజీ దిగ్గజం ఈఎంసీ కార్ప్‌ను 67 బిలియన్ డాలర్లకు డెల్ కొనుగోలు చేసి, డెల్ టెక్నాలజీస్‌గా మారింది. ఈ లావాదేవీ రెండో అతిపెద్ద మొత్తంగా ఉంది.
- అమెరికాలోని చిప్ తయారీ సంస్థ బ్రాడ్‌కామ్‌ను పోటీ సంస్థ అవాగో టెక్నాలజీస్ 37 బిలియన్ డాలర్లతో 2015లో కోనుగోలు చేయడం ద్వారా, అతిపెద్ద సెమీకండక్టర్ సరఫరాదారుగా మారింది. ఇప్పటివరకు ఈ లావాదేవీ టెక్ రంగంలో మూడో అతిపెద్దదిగా ఉండగా, ట్విట్టర్లావాదేవీ వల్ల నాలుగో స్థానానికి చేరుతోంది.
- 2020 అక్టోబరులో చిప్ తయారీ సంస్థ ఎక్స్‌లింక్స్‌ను మరో పోటీ సంస్థ ఏఎమ్‌డీ 35 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఇంటెల్‌తో పోటీపడే స్థాయికి ఏఎండీ చేరింది.
- ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం రెడ్‌హ్యాట్‌ను 2019 జులైలో ఐబీఎం సంస్థ 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, క్లౌడ్ సేవల రంగంలో దూసుకెళ్తోంది.
ప్రస్తుతం యథాతథంగా కార్యకలాపాలు:ట్విట్టర్ కార్యకలాపాలు ఎప్పటిలాగానే జరుగుతాయని కంపెనీ ఛైర్మన్ బ్రెట్ టైలర్, సీఈఓ పరాగ్ అగర్వాల్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. మస్క్ ఆధీనంలోకి వెళ్లాక, ట్విటర్ ప్రైవేట్ కంపెనీ కానున్న నేపథ్యంలో తొలగింపులు చోటుచేసుకుంటాయేమోనని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో సమావేశమైన పరాగ్ మాట్లాడుతూ 'ప్రపంచాన్నే ట్విట్టర్ ప్రభావితం చేస్తోంది. జరుగుతున్న పరిణామాలపై మీ అందరికీ పలు అభిప్రాయాలు ఉండొచ్చు. వాటిని గుర్తించడం ముఖ్యమే. ప్రస్తుతానికి ట్విట్టర్ ఎప్పటి మాదిరిగానే పనిచేస్తుంది. వేతనాలు ఇప్పటి మాదిరిగానే ఉండొచ్చు. అయితే భవిష్యత్తు విధానాలు, పని సంస్కృతిపై మాత్రం హామీ ఇవ్వలేను' అని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ లావాదేవీ పూర్తవడానికి 3-6 నెలల సమయం పట్టొచ్చని పరాగ్ చెబుతున్నారు. ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా మస్క్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ట్విటర్ వాటాదార్లు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.
సీఈఓను తొలగిస్తే:నియంత్రణ మారిన 12 నెలల్లోపు సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగిస్తే, ఆయనకు 42 మిలియన్ డాలర్ల పరిహారం లభించనుంది.
ట్విట్టర్గురించి..:
- 2006లో జాక్ డోర్సె, నోగ్లాస్, బిజ్‌స్టోన్, ఎవాన్ విలియం నేతృత్వంలో మైక్రోబ్లాగింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌గా అమెరికాలో ఏర్పాటైంది. పదహారేళ్ల ప్రాయంలో ఉన్న ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగిస్తున్న మొబైల్ యాప్‌లలో 6వ స్థానం పొందింది.
- ట్విట్టర్లో 130 కోట్లకు పైగా ఖాతాలున్నాయి.
- 140 పదాల్లోనే తమ భావాలను ట్వీట్ ద్వారా వ్యక్తీకరించాల్సి ఉంది.
- రోజుకు 19.2 కోట్ల మంది, నెలకు 39.65 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
- ఉత్తర అమెరికాతో పాటు జపాన్, భారత్, జర్మనీలలో ట్విట్టర్ వినియోగం ఎక్కువ.
- ట్విట్టర్ ద్వారా బీటూబీ మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతుంది. 34% కొనుగోలు ఆసక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతోంది.
లాభదాయకమేనా?:ఫేస్‌బుక్ 2021లో 117 బి. డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగా.. గూగుల్ ఇదే సమయంలో 256.7 బి. డాలర్ల ఆదాయాన్ని పొందింది. అదే ట్విట్టర్‌కు వస్తే, 2021లో సంస్థ ఆదాయం 5 బిలియన్ డాలర్ల (రూ.37,500 కోట్లు)కు పైగా నమోదైంది. 2020లో ఆదాయం 3.72 బి. డాలర్లే. ఇపుడు మరింత ఆదాయాన్ని పొందే దిశగా ట్విట్టర్ కదులుతోంది. రీవ్యూ (న్యూస్‌లెటర్ ప్లాట్‌ఫాం)ను కొనుగోలు చేయడం, ట్విట్టర్ బ్లూ(సబ్‌స్క్రిప్షన్ సేవల)ను ప్రారంభించడం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకుంటోంది. మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు.