Elon Musk Wealth Shrinks :ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద గురువారం భారీగా ఆవిరైంది. ఇందుకు ప్రధాన కారణం టెస్లా షేర్లు భారీగా పతనం కావడం. 2023-24 రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్‌కి సంబంధించి టెస్లా సంస్థ బలహీన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో గురువారం(అక్టోబర్ 19న) కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఈ సంస్థలో 13 శాతం వాటాలున్న ఎలాన్ మస్క్ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
టెస్లా షేర్ విలువ గురువారం ఏకంగా 9.3 శాతం నష్టపోయి 220.11 డాలర్ల వద్ద స్థిరపడింది. దీనితో మస్క్ సంపదలో 16.1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1.30 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
నంబర్ 1 - మస్క్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ ఇప్పటికి కూడా 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మస్క్ సంపద దాదాపు 70 బిలియన్ డాలర్లు పెరిగింది.
పోటీని తట్టుకునేందుకు..
ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని రాణించేందుకు టెస్లా గత కొన్ని నెలలుగా కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీంతో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు భారీగా పతనానికి గురయ్యాయి.
ఏదేమైనా సరే..
ఇంతకుముందు టెస్లా కంపెనీ ఆర్థిక ఒడుదొడుకుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదంటూ వ్యాఖ్యానించిన మస్క్.. బుధవారం ఫలితాల ప్రకటన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే విక్రయాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. అయితే సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే.. తమ కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను నిర్ణీత గడువులోగా డెలివరీ చేసి తీరుతామని టెస్లా ప్రకటించింది. మరోవైపు వచ్చే నెలలో టెస్లా తమ కొత్త ప్రొడక్ట్ సైబర్‌ట్రక్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనలో ఉందని కంపెనీ తెలిపింది.
X New Subscription Fee : ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఏం చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే.. ఎంతంటే?
Gold Rate Today 20th October 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?