తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎలాన్​ మస్క్​కు 'రాకెట్​ దెబ్బ'.. ఒక్కరోజే రూ.లక్ష కోట్లు నష్టం

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారీగా సంపద కోల్పోయారు. ఒక్కరోజులోనే ఆయన సంపద రూ.లక్ష కోట్లకు పైగా ఆవిరైంది. ఈ ఏడాది ఆయన కోల్పోయిన అత్యధిక మొత్తం ఇదే.

elon-musk-money-lost
elon-musk-money-lost

By

Published : Apr 21, 2023, 10:04 AM IST

బిలియనీర్ ఎలాన్ మస్క్ ఒక్కరోజులోనే 1300 కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు. టెస్లా అమ్మకాలు మందగించడం, స్పేస్ఎక్స్ రాకెట్ పేలిపోవడం, ట్విట్టర్ బ్లూటిక్ వైఫల్యాలు వంటి వరుస నిరాశాజనక పరిణామాల మధ్య ఆయన కంపెనీల షేర్లు భారీ కుదుపునకు గురయ్యాయి. దీంతో 24 గంటల వ్యవధిలో 13 బిలియన్ డాలర్లు కోల్పోయారు. భారత కరెన్సీలో చెప్పాలంటే ఇది రూ.లక్ష కోట్లకు పైమాటే. ఈ ఏడాది ఆయన కోల్పోయిన అత్యధిక మొత్తం ఇదే. బ్లూమ్​బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ ప్రస్తుత సంపద 164 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ 'లూయీ విటాన్' అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్ట్.. తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

టెస్లా షేర్లు ఢమాల్!
టెస్లా సంస్థ తొలి త్రైమాసికం ఫలితాల్లో దారుణ ప్రదర్శన చేసింది. 2023 తొలి త్రైమాసికంలో టెస్లా లాభం 2.51 బిలియన్లకు పరిమితమైందని కంపెనీ తన ఫైలింగ్​లో తెలిపింది. ఇది గతేడాది లాభంతో పోలిస్తే 24 శాతం తక్కువ. సంస్థ రాబడి సైతం 20 శాతం పడిపోయింది. ఈ ప్రభావం ఆ సంస్థ షేర్లపై పడింది. టెస్లా షేర్లు గురువారం 9.75 శాతం పతనమయ్యాయి. ఆయన సంపదలో సింహభాగం టెస్లాతోనే ముడిపడి ఉంది.

స్టార్​షిప్ ప్రయోగం విఫలం
మరోవైపు, అంతరిక్ష పరిశోధనలు చేసే స్పేస్ఎక్స్ సంస్థకు సైతం ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ వాహకనౌక ప్రయోగ పరీక్ష గురువారం విఫలమైంది. స్టార్​షిప్ స్పేస్​క్రాఫ్ట్ లాంఛ్ డిజాస్టర్​గా నిలిచింది. నింగిలోకి దూసుకెళ్లిన నాలుగు నిమిషాలకే స్పేస్​షిప్ పేలిపోయింది. చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులు, వస్తువులను పంపే ఉద్దేశంతో 395 అడుగుల ఎత్తైన భారీ స్పేస్​షిప్​ను సంస్థ తయారు చేస్తోంది. వాహకనౌక గాల్లోకి ఎగిరేలా చేయడంలో తాము విజయం సాధించామని, ఇది తమ ప్రధాన లక్ష్యమని ప్రయోగం విఫలమైన అనంతరం మస్క్ చెప్పుకొచ్చారు.

ఇక ట్విట్టర్ విషయంలోనూ ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏడాది క్రితం ట్విట్టర్​ను టేకోవర్ చేసిన ఆయన.. అనేక మార్పులు చేపట్టారు. డబ్బులు చెల్లించకపోతే సెలబ్రిటీ ఖాతాలకు సైతం బ్లూటిక్ వెరిఫికేషన్​ను తొలగిస్తామని స్పష్టం చేశారు. గురువారం ఉదయం నుంచే అనేక మంది సెలబ్రిటీల ఖాతాలకు టిక్ మార్క్ తీసేశారు. భారత్​లోనూ అనేక మంది ఖాతాలకు ట్విట్టర్ మార్క్ తొలగిపోయింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీల నుంచి.. యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి రాజకీయ నాయకుల ఖాతాల వెరిఫికేషన్ మార్క్ సైతం కనిపించడం లేదు. అయితే, కొంతమంది ఖాతాలకు స్వయంగా తాను సబ్​స్క్రిప్షన్ చెల్లిస్తున్నట్టు మస్క్ చెప్పారు. వారు ఎవరో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details