తెలంగాణ

telangana

ETV Bharat / business

'సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్​ దయతో..!'.. పేదరికంలో ప్రపంచ కుబేరుడు!! - elon musk poverty

Elon Musk house: ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్​కు సొంత ఇల్లు కూడా లేదా? ఒక్కోరోజు ఒక్కో స్నేహితుని ఇంట్లో ఉంటూ కాలం గడిపేస్తున్నారా? లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా.. ఎలాంటి విలాసాలకు తావు లేకుండా, పేదరికంలోనే బతికేస్తున్నారా? మస్క్​ తాజా ఇంటర్వ్యూ చూస్తే అన్నింటికీ ఔననే సమాధానం వినిపిస్తోంది.

elon musk net worth
ఎలాన్ మస్క్

By

Published : Apr 18, 2022, 3:29 PM IST

Elon Musk net worth: 251 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 19 లక్షల 15 వేల 155 కోట్ల రూపాయలు. బ్లూమ్​బర్గ్ ప్రకారం.. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ సంపద విలువ ఇది. అంత ఆస్తి ఉన్న వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుంది? ఇంద్రభవనాల్ని తలపించే బంగ్లాలు.. అత్యంత ఖరీదైన కార్లు, విమానాలు.. అందమైన దేశాలకు విహార యాత్రలు.. ఇలా సకల విలాసాలకు చిరునామాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ.. ఎలాన్​ మస్క్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం.

Elon Musk house: తనకు ప్రస్తుతం సొంత ఇల్లు కూడా లేదని వెల్లడించారు ఎలాన్​ మస్క్. స్నేహితుల ఇళ్లలోనే ఉంటూ కాలం గడిపేస్తున్నట్లు చెప్పారు. టెడ్​ కాన్ఫరెన్స్ ఆర్గనైజర్స్​ హెడ్ క్రిస్ ఆండర్సన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు మస్క్. అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, మస్క్ లాంటి సంపన్నులు అతి తక్కువ పన్నులు చెల్లించడంపై అమెరికా చట్టసభ్యుల విమర్శలను ఈ సందర్భంగా ప్రస్తావించారు ఆండర్సన్. వాటిని మస్క్ తోసిపుచ్చారు.

"నా వ్యక్తిగత అవసరాల కోసం ఏటా వందల కోట్ల డాలర్లు ఖర్చు పెడితే అది సమస్యే. కానీ నా విషయంలో అలా కాదు. నాకు ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు. స్నేహితుల ఇళ్లలోనే ఉంటున్నా. ఉదాహరణకు.. టెస్లా ఇంజినీరింగ్​కు ప్రధాన కేంద్రమైన బే ఏరియాకు వెళ్తే.. స్నేహితుల ఇళ్లలో ఉంటా. నాకు పెద్దగా ఖర్చులేమీ లేవు. వ్యక్తిగత విమానం ఒక్కటే ఇందుకు మినహాయింపు. నేను ప్రత్యేక విమానం వాడకపోతే నా సమయం వృథా అవుతుంది." అని స్పష్టం చేశారు మస్క్.

పేద కుబేరుడి కథలు: మస్క్ సాదాసీదా జీవనశైలి గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. "మస్క్ సిలికాన్ వ్యాలీకి వస్తే.. ఈ రాత్రికి నేను ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. మీ ఇంటికి రానా?" అని మెయిల్ చేసేవారని 2015లో వెల్లడించారు గూగుల్ సహవ్యవస్థాపకుడు ల్యారీ పేజ్. ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నానని, ఇకపై తనకు కనీసం ఇల్లు కూడా ఉండదని 2020 మేలో ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్. స్పేస్​ ఎక్స్​ సంస్థ నుంచి అద్దెకు తీసుకున్న ఓ చిన్నపాటి ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇంట్లో మస్క్ ఉంటున్నట్లు 2021 ఆగస్టులో వార్తలు వచ్చాయి.

Elon Musk Grimes: ఇటీవల ఓ మేగజైన్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన మస్క్ ప్రేయసి గ్రైమ్స్ కూడా ఇదే తరహా విషయాలు చెప్పారు. "మస్క్ సంపన్నుడిలా జీవించరు. ఒక్కోసారి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు జీవిస్తారు. ఓ చిన్నపాటి ఇంట్లో పొరుగు వారితో ఇబ్బంది పడుతూ, సరైన భద్రత లేకుండా బతికాం. ఓసారి వరుసగా 8 రోజులు పీనట్ బటర్​తోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. లాస్​ ఏంజెలెస్​లోని మా ఇంట్లో నేను నిద్రపోయే పరుపు పాడైపోయింది. ఓవైపు రంధ్రం పడింది. కొత్తది కొనమంటే మస్క్ ఒప్పుకోలేదు. మా ఇంటికి వెళ్లి తెచ్చుకోమన్నారు." అని వెల్లడించారు గ్రైమ్స్.

ఎలాన్ మస్క్-గ్రైమ్స్

మస్క్ క్లారిటీ: సొంత ఇల్లు లేదని, అత్యంత సాదాసీదా జీవితం గడుపుతారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న విషయాలన్నింటినీ ఇప్పుడు ఆండర్సన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ధ్రువీకరించారు మస్క్. ట్విట్టర్​ను టేకోవర్​ చేయడంపైనా ఆయన స్పందించారు. ఆ సంస్థను దక్కించుకునేందుకు సరిపడా వనరులు తన దగ్గర ఉన్నాయన్నారు. అయితే పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు. 43 బిలియన్ డాలర్లకు ట్విట్టర్​ మొత్తాన్ని కొనేస్తానన్న ప్రతిపాదనకు ఆ సంస్థ అంగీకరించకపోతే తన దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉందని వెల్లడించారు మస్క్. అయితే.. ఆ వివరాలనూ బహిర్గతం చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details