Elon musk twitter deal: అపర కుబేరుడు ఎలాన్ మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్ వార్ మరింత ముదురుతోంది. ట్విట్టర్‌తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేశారు. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్ చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. ట్విట్టర్ దావాపై ఈ ఏడాది అక్టోబరులో విచారణ జరపనున్నట్లు డెలావర్ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్ ఈ దావా వేయడం గమనార్హం.
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించారు. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఎలాన్ మస్క్ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది.