Elon Musk Billionaire Rank : ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలో తిరిగి తొలిస్థానాన్ని అందుకున్నారు టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. 2 నెలల తర్వాత కుబేరుల జాబితాలో తొలిస్థానాన్ని అందుకున్నారు మస్క్. గతేడాది డిసెంబర్‌లో మస్క్‌కు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనం కావడం వల్ల ఆయన రెండో స్థానానికి పడిపోయారు. అదే సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్.. మస్క్‌ను అధిగమించి తొలి స్థానాన్ని అందుకున్నారు. కానీ తాజాగా టెస్లా షేర్లు భారీగా పెరగడం వల్ల.. ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగి అగ్రస్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఎలాన్ మస్క్ ఆస్తుల నికర విలువ 187.1 బిలియన్ డాలర్లుగా ఉందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అదే సమయంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 185.3 బిలియన్ డాలర్లని పేర్కొంది. ఈ ఏడాదిలో టెస్లా షేర్లు ఏకంగా 70 శాతానికిపైగా పెరగడం వల్ల మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది మొదట్లో 137 బిలియన్ డాలర్లుగా ఉన్న మస్క్ సంపద.. ఇప్పుడు ఏకంగా 187 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరులో ఎలాన్ మస్క్ సంపద భారీగా తరిగిపోయింది. దీంతో చరిత్రలో అత్యంత భారీగా సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్' కూడా ప్రకటించింది. మస్క్ కంపెనీ టెస్లా షేర్లు కొవిడ్, చైనా లాక్‌డౌన్ల కారణంగా 65శాతం విలువ కోల్పోయాయి. 2022 సంవత్సరం టెస్లాకు అత్యంత దారుణంగా గడిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఏడాదిలో కంపెనీ దాదాపు 700 బిలియన్ డాలర్లు కోల్పోయింది.