Electric vehicle sales: ఇంజిన్ మోతే లేకుండా విద్యుత్ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యుత్ వాహనాలకు జీవితకాల పన్ను మినహాయిస్తుండడం కలిసొస్తోంది. కేవలం ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ వ్యయం మాత్రమే ఉంటోంది. హైదరాబాద్‌లో చూస్తే గత మూడు నెలల్లోనే 21,000 విద్యుత్తు వాహనాలు రహదారులపైకి అదనంగా వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు నాలుగో వారం వరకు మొత్తం 38,600 విద్యుత్ వాహనాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఇందులో 33,000 ద్విచక్ర వాహనాలేనని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు 25వరకు విద్యుత్ వాహన యజమానులకు మాఫీ చేసిన జీవితకాల పన్ను మొత్తం రూ.120 కోట్లుగా ఉంది.
చలో ఈవీ...
హీరో, హోండా, బజాజ్‌లతో పాటు మరో పది కంపెనీలు విద్యుత్తు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటికి ప్రచారం చేసేందుకు సెలబ్రిటీలను వినియోగిస్తున్నాయి. విద్యుత్ బైక్‌లు తయారుచేస్తున్న ఓ కంపెనీ సినీ కథానాయకుడు వెంకటేష్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. పర్యావరణ హితంగా ఉన్నందునే విద్యుత్తు కార్లు కొంటున్నట్లు ప్రైవేటు సంస్థల అధిపతులు, బ్యాంకర్లు, వ్యాపారులు, సంపన్న యువత చెబుతున్నారు.