కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళలో.. ఇళ్లు కాస్తా పాఠశాలలుగా మారాయి. ఆన్‌లైన్ చదువులు తప్పనిసరి అయ్యాయి. దీంతో విద్యార్థులను ఆకట్టుకునేలా అనేక ఎడ్యుటెక్ అంకురాలు పుట్టుకొచ్చాయి. అప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలు వేల కోట్ల రూపాయల ఆదాయాలను ఆర్జిస్తూ యూనికార్న్ హోదాలను అత్యంత వేగంగా సంపాదించాయి. ఒక్కసారిగా వృద్ధి సాధించడంతో వేల మంది నిపుణులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులనూ ఈ సంస్థలు నియమించుకున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఏడాది క్రితం వరకూ ఒక వెలుగు వెలిగిన ఎడ్యుటెక్ అంకురాలు.. ప్రస్తుతం ఆదాయాలు తగ్గి, నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. మరోవైపు ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి.
కొంతకాలం క్రితం వరకూ ఎక్కడ చూసినా డిజిటల్ అనేమాటే ఎక్కువగా వినిపించింది. విద్యా రంగంలో ఇది మరీ అధికంగా కనిపించింది. పాఠశాలలు డిజిటల్ తరగతులను నిర్వహించాయి. వీటికి తోడు పిల్లలకు అదనంగా నైపుణ్యాలు నేర్పాలని తల్లిదండ్రులు అనుకోవడం.. ఎన్నో అంకురాలకు వరంగా మారింది. 2021లో ఎన్నో సంస్థలు ఈ విభాగంలోకి అడుగుపెట్టాయి. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ఎడ్యుటెక్ సంస్థలు మూడో స్థానంలో నిలిచాయి. ఆ ఏడాదిలో దాదాపు 165 లావాదేవీల ద్వారా 470 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అధికంగా ఉద్యోగాలిచ్చిన విభాగంలోనూ ఇవి అగ్రస్థానాన నిలిచాయి. నిపుణులను ఆకర్షించేందుకు ఎన్నో తాయిలాలనూ ప్రకటించాయి. పోటీలు పడి మరీ వేతనాలు పెంచాయి. ఉపాధ్యాయులను, ఇతర నైపుణ్యాలు బోధించే వారినీ అధికంగా నియమించుకున్నాయి. కాలం ఎపుడూ ఒకే రీతిగా ఉండదు అన్నట్లు 2022లో ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి.
మారిన తల్లిదండ్రుల ధోరణి:
కరోనా భయాలు తగ్గడం, పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో అప్పటివరకూ డిజిటల్ క్లాసులకు పరిమితమైన విద్యార్థులు బడిబాట పట్టారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వినే పాఠాల నుంచి దూరంగా వెళ్లేందుకే అధిక శాతం మంది మొగ్గు చూపించారు. ఫలితంగా ఎడ్యుటెక్ సంస్థలకు కొత్త విద్యార్థుల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతోపాటు, పాత వారూ తమ ప్లాన్లను పునరుద్ధరించుకోవడం మానేశారు. పాఠశాలల్లో ఫీజులు అధికంగా చెల్లించాల్సి రావడంతో చాలా మంది తల్లిదండ్రులు ఈ డిజిటల్ యాప్‌లను తేలిగ్గా తీసుకున్నారు. దీంతో సంస్థల ఆదాయాల్లో ఒక్కసారిగా క్షీణత కనిపిస్తోంది. పైగా నష్టాలూ పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,558 కోట్ల నష్టం వచ్చిందని బైజూస్ తెలిపింది. అన్‌అకాడమీ సైతం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,742 కోట్ల నష్టాలు వచ్చాయని వెల్లడించింది.