Education Loan For Abroad Studies : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడకు వెళ్లేందుకు ఎంతటి ఖర్చునైనా భరించడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి ఏడాది విదేశాలకు వెళ్లి చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందంటే విదేశీ విద్యకు ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే విదేశీ విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం చాలా మంది విద్యార్థులు ముందుగా ఆశ్రయించేది బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు. అయితే ఇవి అందించే విద్యా రుణాలు (Education Loan For Students)తీసుకునే ముందు.. కొన్ని ముఖ్యమైన విషయాలను కచ్చితంగా పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Education Loan Process :విదేశాలకు వెళ్లే ముందు చాలా మంది విద్యార్థులు.. కోర్సులు, విశ్వవిద్యాలయాల ఎంపిక లాంటి అంశాలను మాత్రమే చూస్తారు. ఇందు కోసం అయ్యే ఖర్చుల గురించి కూడా ముందే అంచనా వేసుకుంటారు. అయితే పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణం కారణంగా విదేశాల్లో చదువుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇది భవిష్యత్తులో రుణం తిరిగి చెల్లించే సమయంలో మనల్ని ఆర్థికంగా ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే విద్యారుణాల విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఖర్చులను అంచనా వేయండి..
Foreign Education Loan Calculator : విదేశాల్లో మనం చేసే కోర్సుకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని ముందే అంచనా వేసుకోవాలి. ఇందుకోసం అప్పటికే ఆ దేశంలో చదవిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. కేవలం కోర్సుకు అయ్యే ఖర్చు మాత్రమే కాకుండా ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకోండి. అందుకు అనుగుణంగా రుణదాతల నుంచి రుణం పొందండి. అయితే ఇందుకోసం కొన్ని రుణసంస్థలు ఖర్చును అంచనా వేసేందుకు ఉపయోగపడే కాలిక్యులేటర్ల (Student Loan Calculator)ను అందిస్తున్నారు. వాటి సాయం తీసుకోవచ్చు.
అవగాహన తప్పనిసరి..
Education Loan :ఎడ్యుకేషన్ లోన్ ఎంచుకునే ముందు సొంతంగా కొంత పరిశోధన చేయాలి. ఇంతకు ముందు రుణాలు తీసుకున్న బంధువులు లేదా స్నేహితులతో మాట్లాడాలి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఈ విషయంలో విద్యార్థులకు సహకారం అందిస్తాయి. విద్యా రుణాల గురించి, అందులో ఉండే ప్రక్రియల గురించి అర్థం చేసుకోవడంలో ఈ సలహాలు ఉపయోగపడతాయి. రుణం కోసం దరఖాస్తు చేసేముందు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.