Edible Oil Prices: నిత్యావసరాల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి ఊరట కలిగించే వార్త ఇది. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు కాస్త దిగొచ్చిన నేపథ్యంలో దేశీయంగానూ వీటి ధరలను తగ్గించేందుకు తయారీ సంస్థలు ఈ సమావేశంలో అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. త్వరలోనే వంటనూనె ధరలు రూ.10 నుంచి రూ.12 వరకు తగ్గే అవకాశాలున్నాయని సదరు వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.
ఇటీవల ఫార్చూన్ బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్ కంపెనీ నూనె ధరలను రూ.30 వరకూ తగ్గించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని ఇటీవల కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గిస్తున్నట్లు అదానీ విల్మర్ కంపెనీ ప్రకటించింది. అయితే అంతర్జాతీయంగా వంట నూనె ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో ధరల తగ్గింపుపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సూచించగా.. అందుకు తయారీ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.