ED On Loan Apps : రుణ యాప్‌ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా రేజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే సంస్థల కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
చైనా నియంత్రణలో నడుస్తోన్న అనేక లోన్ యాప్ సంస్థలకు.. ఈ పేమెంట్ గేట్‌వేలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో భాగంగా చైనా నియంత్రణలో ఉన్న సంస్థల బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీల నుంచి రూ.17కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
లోన్ యాప్ సంస్థలు భారతీయుల నకిలీ ఖాతాలను ఉపయోగించి, డమ్మీ డైరెక్టర్లను పెట్టి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ రుణ సంస్థలను చైనా వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. పేటీఎం వంటి పేమెంట్ గేట్‌వేల వద్ద ఉన్న మర్చెంట్ ఐడీ/ఖాతాల ద్వారా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ప్రస్తుతం రేజోర్‌పే, క్యాష్‌ఫ్రీ, పేటీఎం, మరికొన్ని చైనా నియంత్రణ సంస్థల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు పేర్కొంది.