Amway India: మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్‌వే ఇండియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. గొలుసుకట్టు వ్యాపారం మోసం కేసులో ఆమ్‌వేపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. రూ.757కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసుకున్నారు. ఆమ్‌మే నిబంధనలకు విరుద్ధంగా గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీ ఉత్పత్తుల ధరలు బహిరంగ మార్కెట్లో లభించే ప్రముఖ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. కంపెనీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. మొత్తం రూ.757.77కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసుకున్నట్లు తెలిపారు.
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో సంస్థకు చెందిన భూమి, ఫ్యాక్టరీ భవనంతో పాటు యంత్రాలు, మిషనరీలను అధికారులు సీజ్ చేశారు. రూ.411.38కోట్ల విలువైన స్థిర, చరాస్తులు.. 36 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.345.94 కోట్ల నగదును అటాచ్ చేసుకున్నట్లు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.