ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ పవన్ కాంత్ ముంజాల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మంగళవారం ఆయన ఇంట్లో నిర్వహించిన ఈ సోదాల్లో భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. బంగారు, డైమండ్ ఆభరణాలను సీజ్ చేసినట్లు తెలిపింది. వీటన్నింటి విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది.
పవన్ కాంత్ ముంజాల్ (69) ఇల్లు, కార్యాలయాలతో పాటు హీరో మోటోకార్ప్ లిమిటెడ్, హీరో ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌కు చెందిన హేమంత్ దహియా, కేఆర్ రామన్ ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది. దిల్లీ, గురుగ్రామ్‌లలో ఈ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. అయితే, ఏ ఇంటి నుంచి ఎంత మొత్తంలో ఆస్తులు సీజ్ చేశారన్న విషయంపై ఈడీ స్పష్టతనివ్వలేదు. హీరో కంపెనీ సైతం దీనిపై వివరణ ఇవ్వలేదు. మంగళవారం సోదాలు జరుగుతున్న సమయంలో మాత్రం.. ఈడీ అధికారులకు సహకరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది హీరో మోటోకార్ప్. విదేశీ, భారత కరెన్సీతో పాటు నేర నిరూపణకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తాజాగా వెల్లడించింది. హార్డ్ డిస్క్‌లు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.