తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణగ్రహీతల రక్షణ కోసం ఆర్​బీఐ కొత్త నిబంధనలు.. వాటి ప్రయోజనమేమిటంటే? - digital loans

భారత దేశంలో రుణాల వ్యాపారం పూర్తిగా నియంత్రణ సంస్థ పరిధిలోకి వస్తుంది. రుణదాతలు, వారి మధ్యవర్తులందరూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోకే వస్తారు. ప్రస్తుతం రుణాలన్నీ క్షణాల్లో.. డిజిటల్‌లోనే మంజూరవుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు ఈ డిజిటల్‌ రుణాలను మరింత సులభతరం చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రుణగ్రహీతలకు కొన్ని ఇబ్బందులూ ఎదురయ్యాయి. వీటిని పరిష్కరించేందుకు ఆర్‌బీఐ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. మరి, వీటి వల్ల డిజిటల్‌ రుణాలను తీసుకునే ఖాతాదారులకు ఎలాంటి రక్షణ ఉంటుంది, వారికి ఏ విధంగా ప్రయోజనమో తెలుసుకుందాం.

illegal loan apps
లోన్ యాప్స్

By

Published : Sep 10, 2022, 8:38 AM IST

రుణగ్రహీత.. రుణదాతకు మధ్య మూడో సంస్థ జోక్యం చేసుకోవడంతో ఇటీవలి కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రుణాలను అందించడంలో మోసపూరిత విధానాలు, దౌర్జన్యంగా వసూళ్లు, వ్యక్తిగత సమాచారం తస్కరించడం, అధిక వడ్డీ రేట్లు.. ఇలా అనేక సమస్యలను ఆర్‌బీఐ గుర్తించింది. డిజిటల్‌ అప్పుల విధానానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఈ అనైతిక చర్యలను అడ్డుకునేందుకు వచ్చిన నిబంధనలు బ్యాంకులు పాటించాల్సిందే.

నేరుగా చెల్లింపులు..
రుణం ఇచ్చే సంస్థ.. డిజిటల్‌లో అప్పులు ఇచ్చినప్పుడు ఇ-కేవైసీ పూర్తి చేసి, నేరుగా రుణ గ్రహీత ఖాతాలోనే డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. వేరే సంస్థ నుంచి అప్పు ఇచ్చేందుకు వీల్లేదని ఆర్‌బీఐ నిబంధన తీసుకొచ్చింది. మోసపూరిత వ్యాపారాలు నిర్వహించే వారిని నిరోధించేందుకు ఇది ఉపయోగపడనుంది. డిజిటల్‌ రుణాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న యాప్‌లను అడ్డుకోవడమే ఈ నిబంధన లక్ష్యం.

బీఎన్‌పీఎల్‌ లావాదేవీలకూ..
రుణం తీసుకున్నప్పుడు దాని వివరాలు క్రెడిట్‌ బ్యూరోలు సేకరిస్తాయి. ఎంత మొత్తం, వ్యవధి అనేదానితో సంబంధం లేకుండా ప్రతి రుణాన్నీ ఇవి నమోదు చేస్తాయి. కొన్ని డిజిటల్‌ రుణ సంస్థలు తాము ఇచ్చిన అప్పులను క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేయడం లేదు. క్రమం తప్పకుండా చెల్లించిన సందర్భాల్లోనూ ఆ వివరాలు క్రెడిట్‌ బ్యూరోల దగ్గర ఉండటం లేదు. ఫలితంగా రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక నుంచి 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్‌)' సేవలను అందించే సంస్థలూ ఈ వివరాలను సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌లాంటి క్రెడిట్‌ ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది.

చెల్లించేది ఎంత?
రుణానికి సంబంధించి ప్రతి చెల్లింపూ పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆర్‌బీఐ నిబంధన తీసుకొచ్చింది. రుణదాత దగ్గర్నుంచి పరిశీలనా రుసుము, ఇతర ఖర్చులను రుణగ్రహీత నేరుగా వసూలు చేసుకోవాలి. రుణ సేవలను అందించే మధ్యవర్తులు ఎలాంటి ఛార్జీలను అడగకూడదు. రుణానికి అయ్యే ఖర్చులు, ఇతర వివరాలను రుణగ్రహీతకు ఒక పేజీలో అందించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ రేటు, ఇతర వివరాలూ తెలియజేయాలి. దీనివల్ల రుణగ్రహీతకు తాను తీసుకున్న రుణానికి వాస్తవంగా వర్తించే వడ్డీ, ఇతర ఖర్చులను సులభంగా తెలుసుకునే వీలుంటుంది.

వాపసు ఇవ్వొచ్చు..
రుణగ్రహీత ఒకసారి రుణం తీసుకుంటే.. దానికి వాయిదాలు చెల్లించాలి లేదా.. కొన్ని రుసుములతో ముందస్తు చెల్లింపు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత వ్యవధిలోగా డిజిటల్‌ రుణాన్ని తిరిగి ఇచ్చేందుకు వీలుంది. ఈ సమయంలో వర్తించే వడ్డీ రేటును మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇతర రుసుములు విధించడానికి వీల్లేదు. బీమా పాలసీల్లో ఉండే ఫ్రీ లుక్‌ పీరియడ్‌ తరహాలోనే ఇదీ ఉంటుందన్నమాట. బ్యాంకుల బోర్డులు ఈ నిబంధనలను డిజిటల్‌ రుణాలకే వర్తింపజేస్తాయా.. ఇతర రుణాలకూ విస్తరిస్తాయా అనేది వేచి చూడాలి.

వీటితోపాటు.. అవసరమైన మేరకే సమాచారాన్ని సేకరించేలా ఆర్‌బీఐ కొత్త నియమం పెట్టింది. ఫోనులో ఉన్న అన్ని ఫోన్‌ నెంబర్లు, కాల్‌ లిస్టునూ సేకరించకూడదని పేర్కొంది. రుణదాత ఇప్పటికే దీనికి అనుమతి ఇచ్చినా.. దాన్ని తొలగించాల్సిందిగా కోరవచ్చు.
రానున్న 25 ఏళ్ల కాలంలో ఫిన్‌టెక్‌ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. వీటిని వినియోగదారులకు అనుకూలంగా మార్చే క్రమంలో ఈ నిబంధనలు ఉపయోగపడతాయి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ఇవీ చదవండి:రికార్డుల నుంచి 30 వేల కంపెనీల తొలగింపు?.. కేంద్రం కీలక నిర్ణయం!

టాటా నుంచి మరో విద్యుత్‌ కారు.. త్వరలో ఐఫోన్లు కూడా!

ABOUT THE AUTHOR

...view details